Computers and Technology is the most important and the needful thing in our common life. This blog Computer and Technology titled has created for those who are curious to learn about new things about latest technology and latest computers, its technology, phones, future innovations etc. So we can understand Technology properly to implement those thing on our finger tips to make technology come true in our practical life.

Saturday, 26 November 2016

జనానికి మరో ఊరట


కొత్త నోట్ల కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలకు మరో వెసలుబాటు కల్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ). ఇప్పటి వరకు బిగ్ బజార్లలో డెబిట్ కార్డ్ పై రూ.2వేలు వరకు తీసుకునే వెసలుబాటు ఇచ్చింది. ఇప్పుడు ఐనాక్స్ ధియేటర్లలోనూ ఇలాంటి అవకాశాన్ని కల్పించింది. ఒకటో తేదీ వస్తుండటం.. సిటీలో పూర్తి స్థాయిలో ATMలు పని చేయక ఇబ్బంది పడుతున్న జనానికి మరో ఊరట ఇది. ఐనాక్స్ ధియేటర్లలో డెబిట్ కార్డ్ ద్వారా రూ.2వేలు తీసుకోవచ్చు. ఏ బ్యాంక్ కార్డ్ అయినా పర్వాలేదని.. అన్ని డెబిట్ కార్డులకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది SBI. ధియేటర్లలో డబ్బులు తీసుకున్న వారు.. అక్కడ సినిమా చూడాల్సిన నిబంధన ఏమీ లేదు.

Saturday, 15 October 2016

చిరంజీవి రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన చిరంజీవి పారితోషికం విషయంలోనూ టాపే. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించడం, మళ్లీ సినిమా పరిశ్రమ తలుపు తట్టడం జరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన తన 150వ సినిమా పనిలో బిజీగా ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు నాగార్జున నిర్వహించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా కూడా వ్యవహరించనున్నారు.
 
ఈ ప్రోగ్రామ్‌ కోసం చిరంజీవికి భారీగా రెమ్యునరేషన్‌ ఫిక్స్‌ చేశారట నిర్వాహకులు. ఒక్కో ఎపిసోడ్‌కు పదిలక్షల రూపాయలు చిరంజీవి తీసుకోనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. అలా ఎన్ని ఎపిసోడ్‌లు ప్రసారమైతే అన్ని పదిలక్షలన్న మాట. మెగాస్టార్‌కు ఉన్న క్రేజ్‌ రీత్యా ఈ రెమ్యునరేషన్‌ ఆయనకు ఇవ్వదగినదే. పైగా చిరంజీవి తొలిసారి బుల్లితెర మీద కనిపిస్తుండడంతో ప్రేక్షకులు ఆ షోకు బ్రహ్మరథం పడతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఆ షోకు చిరు మరింత గ్లామర్‌ తీసుకొస్తారనడంలో సందేహం లేదు.

మరో సంచలనానికి సిద్దమైన గూగుల్, ఫేస్‌బుక్

యావత్ ప్రపంచాన్ని ఇంటర్నెట్టుతో అనుసంధానించే కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్ దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలు మరో బృహత్తరకార్యానికి సన్నాహాలు చేస్తున్నాయి. సెకనుకు 15వేల జీబీల సమాచారాన్ని బదిలీ చేయగల అత్యంత శక్తిమంతమైన కేబుల్ తో ఆసియాను, అమెరికాలను సముద్ర అంతర్భాగం ద్వారా అనుసంధానించనున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజిలస్ నగరం నుండి ప్రారంభమయ్యే ఈ కేబుల్ హాంకాంగ్ ను అనుసంధానిస్తుంది. సాంకేతిక భాషలో చెప్పాలంటే 120 టెరాబైట్స్ పర్ సెకండ్ వేగంతో ఈ కేబుల్ డేటాను బదిలీ చేస్తుంది. రెండు ఖండాలకు అటో దిక్కున ఇటో దిక్కున గల హాంకాంగుకు, లాస్ ఏంజిలస్ నగరాలకు మధ్య దూరం అక్షరాల 12800 కిలోమీటర్లు. ఇంటర్నెట్ చరిత్రలో ఈ ప్రాజెక్ట్ అతిపెద్ద విప్లవంగా చెప్పవచ్చు. పసిఫిక్ మహాసముద్రం అంతర్భాగం నుండి వేయనున్న ఈ ఇంటర్నెట్ కేబుల్ ప్రాజెక్టులో గూగుల్, ఫేస్ బుక్ తో పాటు పసిఫిక్ డేటా కమ్యూనికేషన్, టీఈ సబ్ కామ్ తదితర నాలుగు సంస్థలు పాలుపంచుకోనున్నాయి. వచ్చే రెండేళ్లలోగా ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయాలని ఈ సంస్థలు కంకణం కట్టుకున్నాయి.

సొంత రాష్ట్రాన్ని కించపరుస్తావా!

తనకు బహుమతిగా దక్కిన బీఎండబ్ల్యూ కారును.. జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ వెనక్కి ఇచ్చేస్తానని చేసిన ప్రకటనపై త్రిపుర ప్రభుత్వం గుర్రుగా ఉంది. త్రిపుర రహదారులు ఈ కారు తిరిగేందుకు అనువుగా లేవని, తగిన సర్వీస్‌ సెంటర్లు కూడా లేనందున.. బీఎండబ్ల్యూను వెనక్కి తీసుకొని.. దానికి తగిన నగదు కోరడాన్ని తప్పుబట్టింది. త్రిపురలో రాష్ట్రపతి, ప్రధాని సహా విదేశీ ప్రముఖుల కార్లు ఎటువంటి ఇబ్బంది లేకుండానే తిరిగాయని ప్రజా పనుల శాఖ మంత్రి బాదల్‌ పేర్కొన్నారు. స్వరాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడిన దీపకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రవాణా మంత్రి మాణిక్‌దేవ్‌ అన్నారు.

మాటలు చెప్పదు.. చేతలే! - భారత సైన్యానికి మోదీ ప్రశంస

సర్జికల్‌ దాడులకు ఆధారాలు చూపాలన్న ప్రతిపక్ష నేతలపై ప్రధాని మోదీ పరోక్షంగా విరుచుకుపడ్డారు. భారత సైన్యం వాక్‌శూరత్వం చూపదని, తన వీరత్వాన్ని ప్రదర్శిస్తుందని స్పష్టంచేశారు. శుక్రవారం భోపాల్లో ‘శౌర్య స్మారక్‌’ను ఆవిష్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాజీ సైనిక సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. సరిహద్దులు, దేశాలకు అతీతంగా మానవ జాతిని భారత సైన్యం రక్షిస్తోందని కితాబిచ్చారు. ‘మన జవాన్ల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వారి యూనిఫారం, వారి ధైర్యసాహసాల గురించే ప్రస్తావిస్తుంటాం. కానీ అంతకుమించిన మూర్తీభవించిన మానవత్వం వారిలో ఉంది. వారు మాటలు చెప్పరు.. వీరత్వాన్ని చూపుతారు. మన రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌ కూడా అంతే’ అని హర్షధ్వానాల నడుమ చెప్పారు. సభికులు దేశభక్తి నినాదాలు చేశారు. ఇంతకుముందు తానీ వ్యాఖ్యలు చేసి ఉంటే విమర్శకులు తనపై దాడిచేసేవారని, మోదీ నిద్రపోతున్నారని, ఏమీ చేయడం లేదని అనేవారని తెలిపారు. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భారత ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు. ‘యెమెన్‌ యుద్ధంలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడంలో భారత సైనికులు కీలక పాత్ర పోషించారు. 5వేల మంది భారతీయులను, పాకిస్తానీలతో పాటు ఇతర దేశాలవారినీ కాపాడారు. సరిహద్దులను రక్షిస్తూ.. మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు’ అని కొనియాడారు. మేల్కొని ఉండాల్సిన సమయంలో నిద్రపోతే సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సైన్యం మనల్ని క్షమించదని స్పష్టం చేశారు. శివాజీ, మహారాణా ప్రతాప్‌ వంటివారు మన వీరత్వానికి ప్రతీకలని పరీకర్‌ పేర్కొన్నారు. ‘మనం ఎవరినీ ఇబ్బందిపెట్టం. ఎవరైనా మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తే వదిలిపెట్టం అనేది ఆయన విధానం’ అని చెప్పారు.

ఎయిర్ సెల్ : రూ.24లకే 1జీబీ 3జీ డేటా

వినియోగదారులకు కొత్త ఆఫర్ ఇచ్చింది ఎయిర్ సెల్. రూ.24 లకే 1 జీబీ 3జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. 28 రోజుల పాటు దీని వ్యాలిడిటీ ఉంటుంది. అయితే దీనకంటే ముందు  రూ. 329లకు 2జీబీ 3జీ డేటాను రీచార్జ్ చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులు ఉంటుంది. ఈ ఆఫర్ రీ చార్జ్ చేసుకుంటే.. ఆ తర్వాత చేసుకునే ప్రతి రూ. 24 ల రీ చార్జ్ కు 1జీబీ 3జీ డేటా లభిస్తుంది.  ఈ ఆఫర్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, కర్ణాటక, అసోం, ఒడిషా, బీహార్, జార్ఖండ్, పంజాబ్, జమ్ము కాశ్మీర్ లలో ఉంటుంది.

చెలరేగిపోతున్న చైనా గూడ్స్‌

ఎన్‌ఎ్‌సజిలో భారత సభ్యత్వానికి మో కాలడ్డడం, తీవ్రవాది మసూద్‌ అజార్‌పై ఐరాస విధించదలచిన నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నందున దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలని డిమాండ్లు ఒకపక్క వెల్లువెత్తుతున్నా.. మరోవైపు భారతలో చైనా వస్తువుల విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయని చైనా మీడియా కోడై కూస్తోంది. భారతలో అతిపెద్ద పండుగ సీజన్‌ అయిన దివాళీ సీజన్‌లో షాపింగ్‌ జోరుగా సాగుతుందని, ఈ సీజన్‌లో చైనా గూడ్స్‌ను బహిష్కరించాలని సోషల్‌ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోందని చైనాకు చెందిన అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. కొందరు భారత రాజకీయ నాయకులు కూడా ఇందుకు ఆజ్యం పోస్తున్నారని, ఇంత ఎత్తు న వ్యతిరేక ప్రచారం జరుగుతున్నా... భారతలో చైనా గూడ్స్‌కు విపరీతమైన పాపులారిటీ ఉందని, ఇండియా ప్రభుత్వం చైనా వస్తువులపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది. 
బహిష్కరణ ప్రచారం ఎలాంటి ప్రభావం చూపలేకపోయిందని, అక్టోబర్‌లో భారత టాప్‌3 ఆన్‌లైన్‌ రిటైలర్లు విక్రయించిన వస్తువుల్లో చైనా ఉత్పత్తులు రికార్డు స్థాయిని నమోదు చేశాయని పేర్కొంది. 
మీకే నష్టం... 
ద్వైపాక్షిక వాణిజ్యం చైనా, భారత మధ్య బంధానికి మూలాల్లో ఒకటని, 2015లో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 7,000 కోట్ల డాలర్లకు చేరిందని గ్లోబల్‌టైమ్స్‌ తెలిపింది. చైనాతో వాణిజ్యంలో పెరిగిపోతున్న లోటు పట్ల భారత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ లోటుకు భారత చర్యలే కారణమని గ్లోబల్‌ టైమ్స్‌ విమర్శించింది. ఈ లోటు తగ్గించి సమతుల్యం సాధించడానికి ఇరు దేశాలు తగిన చర్యలు తీసుకోవాలని, గతంలో తీసుకున్న చర్యలు పెద్దగా ప్రభావం చూపలేదని తెలిపింది.

కొత్త జిల్లాలతో రెవెన్యూ ఖజానా కళకళ

రాష్ట్ర రెవెన్యూ ఆదాయం పెరుగుతోంది. కొత్త జిల్లాల ఆలోచన కూడా  రెవెన్యూ ఖజానాకు కళ తీసుకొచ్చింది. హైదరాబాద్ సహా… జిల్లాల్లో … రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకోవడమే గాకుండా రికార్డు స్థాయిలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. గత ఆరునెలల కాలంలోరాష్ట్రంలో భూములు, భవనాల అమ్మకాల్లో 31.21 శాతం పెరుగుదల కనిపించినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య  ఆరు నెలల కాలంలో… 19వందల35 కోట్లు ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఖజానాకు చేరాయి.
గత ఏడాది.. ఇదే కాలంలో.. సర్కారుకు స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ ద్వారా 14వందల75 కోట్లు వచ్చింది.
ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నెలలో 306 కోట్లు,  మే నెలలో 370 కోట్లు, జూన్ లో 310 కోట్లు, జూలైలో  310 కోట్లు, ఆగస్టులో 329 కోట్లు, సెప్టెంబర్ నెలలో 310 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.
ఈ ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వం స్టాంపు, రెవెన్యూ శాఖ ద్వారా పెట్టుకున్న టార్గెట్ 4వేల291 కోట్లు. తొలి ఆరు నెలల్లోనే… 45 శాతం ఆదాయ  లక్ష్యాన్ని సర్కారు చేరుకుంది.
దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే… తెలంగాణ స్థిరమైన ఆదాయంతో అగ్రభాగాన ఉందనీ.. ఏపీలో 12. 27 శాతం వృద్ధి ఉంటే… కర్ణాటకలో 2. 31 శాతం, కేరళలో 3. 57 శాతం, తమిళనాడులో మైనస్ 2.63 శాతం వృద్ధి ఉందని ప్రభుత్వం తెలిపింది. జిల్లాల వారీగా చూస్తే… మెదక్ నుంచి ఎక్కువ ఆదాయం దక్కింది. మెదక్ లో అత్యధికంగా 47. 94 శాతం వృద్ధి కనిపించింది. ఆ తర్వాత.. హైదరాబాద్, రంగారెడ్డి.. మహబూబ్ నగర్, వరంగల్ కరీంనగర్, నిజామాబాద్ లలో గ్రోత్ ఉంది. అత్యల్పంగా నల్గొండలో రెవెన్యూ గ్రోత్ రేట్ ఆరు శాతమే ఉంది. ఏడాది   ఐదు లక్షల 76 వేల 991 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయినట్టు సర్కారు తెలిపింది.

రూ.35,000 కోట్లు ముంచిన నోట్‌7

గెలాక్సీ నోట్‌ 7 స్మార్ట్‌ఫోన్లను వెనక్కి రప్పించడం, విక్రయాల నిలిపివేత వల్ల శామ్‌సంగ్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుత త్రైమాసికంలో మొబైల్‌ వ్యాపారం ద్వారా వచ్చే లాభమంతా కోల్పోయే అవకాశం ఉంది. నోట్‌ 7 విక్రయాల నిలిపివేత ప్రభావంతో ప్రస్తుత, రాబోయే త్రైమాసికాల్లో 300 కోట్ల డాలర్ల (సుమారు రూ.20000 కోట్లు) భారం పడనుందని శామ్‌సంగ్‌ వెల్లడించింది. దీంతో ఈ ఫోన్లను వెనక్కి రప్పించడం వల్ల మొత్తంగా పడే భారం 530 కోట్ల డాలర్లని (రూ.35000 కోట్లు) తెలిపింది. బ్యాటరీ వేడెక్కడం, పేలిపోవడం లాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో గెలాక్సీ నోట్‌ 7 విక్రయాలను శామ్‌సంగ్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం దృష్ట్యా ఇప్పటికే అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి లాభం అంచనాలను 260 కోట్ల డాలర్ల (రూ.17000 కోట్లు) వరకు తగ్గించింది. అంటే మొబైల్‌ వ్యాపారం ద్వారా వచ్చే లాభాన్ని పూర్తిగా శామ్‌సంగ్‌ కోల్పోనుందన్నమాట. అయితే పై మొత్తంలో మొదటి సారి రీకాల్‌ వ్యయ భారాన్ని కంపెనీ కలపలేదు. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ భారం 88 కోట్ల డాలర్ల (1 ట్రిలియన్‌ వాన్‌) నుంచి 166 కోట్ల డాలర్ల (2 ట్రిలియన్‌ వాన్‌) వరకు ఉండే అవకాశం ఉంది. రీకాల్‌ వల్ల పడే భారాన్ని ఇతర వ్యాపారాల ద్వారా శామ్‌సంగ్‌ తగ్గించుకునే అవకాశం కనిపిస్తంది. రీకాల్‌ వ్యయ భారం పోను మూడో త్రైమాసికంలో 460 కోట్ల డాలర్ల (దాదాపు రూ.30,000 కోట్లు) ఆదాయాన్ని ఆర్జిస్తామని కంపెనీ ఆశాభావంతో ఉంది. అయితే ఇందులో చాలా భాగం అడ్వాన్స్‌డ్‌ డిస్‌ప్లేలు, సెమీ కండక్లర్ల విక్రయాల ద్వారా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే నాణ్యత ప్రమాణాల ప్రక్రియను మెరుగుపర్చుకునేందుకు గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టుబోతున్నట్లు శామ్‌సంగ్‌ తెలిపింది. అయితే పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
భారత్‌లో రూ.6,457 కోట్లు..
గెలాక్సీ నోట్‌ 7 రీకాల్‌ ప్రభావంతో శామ్‌సంగ్‌ ఇండియా రూ.6,457 కోట్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని పరిశోధన సంస్థ సీఎంఆర్‌ వెల్లడించింది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో శామ్‌సంగ్‌ ఇండియా ఆదాయం 46 శాతం వృద్ధితో రూ.45,446 కోట్లు నమోదుకావొచ్చని ఇంతకుమునుపు అంచనా వేశాం. అయితే నోట్‌ 7 పరిణామం నేపథ్యంలో ఆదాయం 25 శాతం మాత్రమే పెరిగి రూ.39,989 కోట్లుగా ఉండొచ్చని అనుకుంటున్నామ’ని తెలిపింది. అయితే కంపెనీ ఆర్థిక గణాంకాలపై ఆయా పరిశోధన సంస్థలు వెల్లడిస్తున్న అంచనాలు తప్పులని శామ్‌సంగ్‌ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. ‘గెలాక్సీ నోట్‌ 7ను ఇప్పటివరకు భారత్‌లో విక్రయించలేదు. వస్తోన్న నివేదికలకు భిన్నంగా ఈ ఏడాది రికార్డు విక్రయాలను సాధిస్తామ’ని తెలిపారు.

కశ్మీర్‌లో చైనా జెండాల ప్రదర్శన !

కశ్మీర్ లో వేర్పాటు వాదుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇప్పటి వరకు పాక్ జెండాలు మాత్రమే ఎగురవేసిన అల్లరిమూకలు తొలిసారిగా పాక్ జెండాలతో పాటు చైనా జెండాలు ప్రదర్శించారు. బారాముల్లా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా తమ పోరాటంలో చైనా సాయం కావాలంటూ పిచ్చిరాతలు రాశారు. ర్యాలీ సందర్భంగా జెండాలు పట్టుకున్న వారు తమ ముఖాలు కనిపించకుండా ముఖాలకు మాస్కులు ధరించారు. అలాగే విధుల్లో ఉన్న పోలీసులపై కూడా ఈ అల్లరిమూకలు రాళ్లు రువ్వాయి. పరిస్థితిని అదపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గోవాలో బ్రిక్స్ శిగరాగ్ర సదస్సు పాల్గొనేందుకు భారత్ వచ్చిన సందర్భంలో ఇలాంటి పోకడలు కనిపించడం విశేషం.

పాక్‌ మరింత ఏకాకి!

ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా మరింత ఏకాకిని చేసే దిశగా భారత తన దౌత్యపోరును మరింత తీవ్రతరం చేసింది. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి సమావేశాలు శనివారం నుంచి గోవాలో జరుగనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పెంగ్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా ప్రభుత్వాధినేతలు తరలివస్తున్నారు. బ్రిక్స్‌ భేటీకి ముందు పుతిన్‌, జిన్‌పెంగ్‌లతో ప్రధాని మోదీ విడివిడిగా ముఖాముఖి ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించాలని, తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై చర్యలు తీసుకోవాలని ఆయన గట్టిగా కోరనున్నారు. ముఖ్యంగా జైషే మహ్మద్‌ నేత మసూద్‌ అజర్‌పై ఐక్యరాజ్యసమితి ఉగ్రవాది ముద్ర వేయకుండా అడ్డుకుంటున్న చైనా వైఖరిపై జిన్‌పెంగ్‌తో ఆయన చర్చిస్తారు. ఉరీలో భారత సైనిక స్థావరంపై పాక్‌ ప్రేరిత ఉగ్రవాదుల దాడి దరిమిలా భారతలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యం ఏ ర్పడింది. పాక్‌కు గట్టి మద్దతిస్తున్న చైనా.. భారత యత్నాలను అడ్డుకునే అవకాశముంది. అయితే మౌలికంగా అన్ని రకాల ఉగ్రవాదాన్ని జిన్‌పెంగ్‌ ఖండించే అవకాశముంది. కాగా.. బ్రిక్స్‌ సమావేశానికి ముందు బంగాళాఖాత బహుముఖ సాంకేతిక ఆర్థిక సహకార కూటమి(బిమ్స్‌టెక్‌) భేటీ జరుగుతుంది. అనంతరం ఆదివారం బ్రిక్స్‌-బిమ్స్‌టెక్‌ సం యుక్త సమావేశం ఉంటుంది. ఇందులో పాల్గొనేందుకు భూటాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, థా య్‌లాండ్‌ ప్రధానులు, మియన్మార్‌ స్టేట్‌ కౌన్సిలర్‌ కూడా వస్తున్నారు. అఫ్గానిస్థాన్‌, మాల్దీవులను ప్ర త్యేక అతిథులుగా ఆహ్వానించారు. ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలను ఏర్పాటుచేసి వారికి ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశాలపై చర్యలు తీసుకోవాలని మోదీ ఈ సందర్భంగా కోరతారు. ఇప్పటికే పాక్‌ సీమాంతర ఉగ్రవాద చర్యలను భారత ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో, జి-20 భేటీలో ఎండగట్టింది. కశ్మీరును అంతర్జాతీయ సమస్యగా చిత్రించేందుకు పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఆయన దౌత్యవేత్తలు చేసిన ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. కాగా.. భారత జాతీయ భద్రత సలహాదారు అజిత ధోవల్‌ బ్రిక్స్‌ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొన్నారు.
 
ఉగ్రవాదం అణచివేతలో పరస్పర సహకారంపై చర్చించారు. ఆ సహకారానికి చట్టబద్ధత కల్పించాలని ప్రతిపాదించారు. ఆయన వాదనతో ఆయా దేశాల అగ్రనేతలు, దౌత్యవేత్తలు ఏకీభవించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసేవారిపైనే గాక.. వారికి ఆయుధాలు, మందుగుండు అందజేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని ధోవల్‌ గట్టిగా అభ్యర్థించారు. సైబర్‌ భద్రత, ఉగ్రవాదం అణచివేత, ఇంధన భద్రతపై వర్కింగ్‌ గ్రూపుల ఏర్పాటుకు బ్రిక్స్‌ దేశాలు సమ్మతించాయి. కాగా, బ్రిక్స్‌, బిమ్స్‌టెక్‌ భేటీల నేపథ్యంలో.. కొత్త భాగస్వామ్యాలకు బాటలు వేయడం, ఆసియా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుక్కునేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. మరోవైపు, వివాదాస్పద అంశాలను భారత, పాక్‌ శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అమెరికా సూచించింది.

ఆ రెండు విషయాల్లో భారత్‌ను అడ్డుకుంటాం

జైషే మహ్మాద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించేందుకు సహకరించాలని కోరుతున్న భారత్ విజ్ఞప్తిని చైనా మరోసారి తోసిపుచ్చింది. అణ్వాయుధాల సరఫరాల గ్రూపులో భారత్ చేరడంపై తమ వైఖరి మారబోదని పునరుద్ఘాటించింది.
రేపటి నుంచి రెండు రోజులపాటు గోవాలో బ్రిక్స్ సదస్సు జరుగనున్న నేపథ్యంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి జెంగ్ శువాంగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
ఐక్యరాజ్య సమితి చార్టర్ సంప్రదింపులు, ఏకాభిప్రాయం ప్రకారమే భారత్ అణ్వాయుధాల సరఫరాల గ్రూప్‌లో చేర్చుకోవాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.

మరోవైపు మసూద్ అజార్ ను తీవ్రవాదిగా ప్రకటించాలని భారత్ కోరుతుండటంపై ఆయన స్పందించారు. ‘ఈ అంశం సభ్య దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే మేం అతనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు’ అని జెంగ్ వివరించారు.

ఇండియా అణ్వాయుధాల సరఫరా గ్రూపులో సభ్యదేశం కావాలంటే 48దేశాలు అంగీకరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
చైనా భారత్ సభ్యత్వాన్ని తిరస్కరించడంతో ఈయేడాది జూన్ లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు కూడా భారత్ దరఖాస్తును పక్కనబెట్టాయి.

అయితే ఈ అంశాలు భారత్-చైనాల మధ్య దౌత్యసంబంధాలకు ఏమాత్రం ఆటకం కాదని జెంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రామ రక్షా స్తోత్రం

శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః
శ్రీమాన్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః
ధ్యానమ్
ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్
స్తోత్రమ్
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్
ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్
సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్
స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్
రామరక్షాం పఠేత్ప్రాఙ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతుఫాలం దశరథాత్మజః
కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః
జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః
సుగ్రీవేశః కటీపాతు సక్థినీ హనుమత్-ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్
జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః
పాదౌవిభీషణ శ్రీదఃపాతు రామో‌உఖిలం వపుః
ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్
పాతాళ భూతల వ్యోమ చారిణశ్-చద్మ చారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్
నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి
జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః
వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాఙ్ఞః సర్వత్ర లభతే జయ మంగళమ్
ఆదిష్టవాన్ యథాస్వప్నే రామ రక్షా మిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః
ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్
అభిరామ స్త్రిలోకానాం రామః శ్రీమాన్సనః ప్రభుః
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ
ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ
శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతాం
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ
ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథిసదైవ గచ్ఛతాం
సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః
రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః
వేదాంత వేద్యో యఙ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి నసంశయః
రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతావాససం
స్తువంతి నాభిర్-దివ్యైర్-నతే సంసారిణో నరాః
రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందేలోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ
శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే
మాతారామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ న జానే
దక్షిణేలక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతోమారుతిర్-యస్య తం వందే రఘువందనమ్
లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే
మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం
భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్
రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం

Friday, 14 October 2016

హిందువులపై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రవాస భారతీయులతో భేటీ కాబోతున్నారు. రిపబ్లికన్ హిందూ కొయలిషన్ (ఆర్‌హెచ్‌సీ) న్యూజెర్సీలో ఆదివారం నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఉగ్రవాదం వల్ల బాధితులైన హిందువులనుద్దేశించి ఆయన మాట్లాడతారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల కార్యక్రమానికి అధ్యక్ష అభ్యర్థి హాజరవడం ఇదే మొదటిసారని ఆర్‌హెచ్‌సీ వ్యవస్థాపక చైర్మన్ శలభ్ ‘షల్లి’ కుమార్ చెప్పారు. ఈ సమావేశం వల్ల కశ్మీరీ, హిందూ శరణార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. హిందువులు, భారతీయులతో స్నేహం కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
 
గత నెలలో విడుదల చేసిన వీడియోలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తాను ఆర్‌హెచ్‌సీ సమావేశానికి హాజరవుతానని పేర్కొన్నారు. హిందూ సమాజం ప్రపంచ నాగరికతకు, అమెరికా సంస్కృతికి విశేష సేవలందించిందన్నారు. కుటుంబ విలువలు, కఠోర శ్రమ, బలమైన అమెరికన్ విదేశాంగ విధానం సంబంధిత పరస్పర విలువలను ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అత్యంత అద్భుతమైనదని తెలిపారు.

విజయవాడకు హైస్పీడ్‌ రైలు!

మైసూరు నుంచి బెంగుళూరు, చెన్నై మీదుగా విజయవాడకు త్వరలో హై స్పీడ్‌ రైలు రానుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, జర్మనీ దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. వచ్చే సంవత్సరం జనవరి నుంచి జర్మనీ ప్రభుత్వం అధ్యయనం ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి నిధులను జర్మనీ ప్రభుత్వం సమకూర్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

నిజమో కాదో గూగుల్‌ చెప్పేస్తుంది

ఏదైనా వార్త తెలి స్తే అది నిజమా కాదా అనే సందేహంలో కొంత మంది టెక్‌ ప్రియులు వెంటనే దాన్ని గూగుల్‌ చేసి సమాచారం తెలు సుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ అది నిజమా కాదా అని ఎవరు నిర్ధారిస్తారు అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. దీంతో ఎక్కడాలేని కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది. దీనికి చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ ఒక అడుగు ముందుకేసింది. సెర్చ్‌ కంటెంట్‌లో ఫ్యాక్ట్‌ చెక్‌ అనే ఫీచర్‌ని పరిచయం చేస్తుంది. ప్రతీ అంశం పక్కన ఫ్యాక్ట్‌చెక్‌ అని చూపుతుంది. ప్రస్తుతం గూగుల్‌ న్యూస్‌ అండ్‌ వెదర్‌ ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌ లో ఫ్యాక్ట్‌చెక్‌ ట్యాగ్‌తో అమెరికా, యూకేలలో యూజర్లకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగిలిన దేశా ల్లోనూ విస్తరించనుంది. దీంతో స్పష్టమైన సమచారం కోసం గంటల తరబడి వెబ్‌లో వెతికే వారికి పెద్ద ఊరటే. ప్రపంచ నలుమూలల నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌ల పేరుతో.. వివిధ రకా ల ఆర్టికల్స్‌ వచ్చేవాటిలో ఏది నిజమో కాదో తెలియని సంది గ్ధం ఉంటుంది కాబట్టి న్యూస్‌ కచ్చితత్వంపై పనిచేస్తున్న ట్లు గూగుల్‌ తెలిపింది. ముఖ్యంగా ఆరోగ్య, రాజకీయ సమా చారం విషయాల్లో ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు పేర్కొంది.

అలా చేస్తే సంబంధాలు దెబ్బతింటాయి... చైనా హెచ్చరిక

భారతీయులు తల్చుకుంటే వ్యాపారాలు దెబ్బతింటాయన్న భయం చైనాకు కూడా ఉందని స్పష్టమవుతోంది. నేరుగా చెప్పకుండా పరోక్షంగా హెచ్చరికలు, సలహాలు ఇస్తోంది. రాజకీయ సమస్యలను బాహాటంగా చాటిచెప్పడం కోసం చైనా వస్తువులను బహిష్కరించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని ఆ దేశంలోని ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక శుక్రవారం ప్రచురించిన ఓ వ్యాసంలో పేర్కొంది. ఇలాంటి చర్యల వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయంటోంది. అందుకు బదులుగా ఇండియాలో ఇండస్ట్రియల్ స్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని సలహా ఇచ్చింది. వాణిజ్య లోటును భర్తీ చేయడానికి ఇదే సరైన మార్గమని పేర్కొంది. చైనా వస్తువులకు దూరంగా ఉంటూ రక్షణ వాదాన్ని అనుసరించకుండా, ఇరు దేశాల వాణిజ్యంలో ఏర్పడిన భారీ లోటును పారిశ్రామిక మౌలిక సదుపాయాలను విస్తరించుకోవాలని తెలిపింది. వాణిజ్య రక్షణవాదం ద్వారా చైనాతో వాణిజ్య లోటును తగ్గించుకోవాలని భారతదేశం ప్రయత్నిస్తోందని మార్చిలో భారతీయ మీడియా పేర్కొందని, మరోవైపు సోషల్ మీడియాలో చైనా వస్తువులను కొనవద్దని భారతీయులను కోరుతున్నారని, ఇటువంటి రక్షణ వాదం వల్ల ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని పేర్కొంది.దీనివల్ల వాణిజ్యలోటు తగ్గకపోగా ద్వైపాక్షిక సంబంధాలకు నష్టం జరుగుతుందని తెలిపింది.

Thursday, 13 October 2016

అధ్యక్ష పీఠం ఎవరెక్కినా.. భారత్‌తో సంబంధాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పాలి

భారత్‌తో సంబంధాలకు పెద్దపీట వేయాల్సిందిగా అమెరికాకు ఆ దేశ అత్యున్నత మేధావి వర్గం సిఫార్సు చేసింది. రానున్న ఎన్నికల్లో గెలిచి దేశాధ్యక్ష పదవిని ఎవరు చేపట్టినా సరే తమ పదవీకాలంలోని తొలి వంద రోజుల్లోపే భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవ్వాలని సూచించింది. తద్వారా ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు ఇస్తున్న ప్రాధాన్యతను బలంగా చాటిచెప్పినట్లవుతుందని పేర్కొంది. భారత్‌-అమెరికా భద్రత సహకారంపై అమెరికాకు చెందిన ‘వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయనాల కేంద్రం(సీఎస్‌ఐఎస్‌)’ తాజాగా కీలక నివేదిక సమర్పించింది. భారత్‌తో రక్షణ సంబంధాలు బలోపేతమవ్వాలంటే.. వ్యవస్థాపక ఒప్పందాలపై ఆ దేశం సంతకాలు చేసేలా చూడటం ముఖ్యమని సీఎస్‌ఐఎస్‌ సూచించింది. లేనిపక్షంలో కొన్ని కీలక పరిజ్ఞానాలను భారత్‌కు అందజేయడం దాదాపు అసాధ్యమని వెల్లడించింది. పసిఫిక్‌, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో భద్రతా వ్యవహారాలకు సంబంధించి భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌లతో సంయుక్త చర్చలు జరిపేలా నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. తాలిబన్లతో చర్చల్లో పాల్గొనాల్సిందిగా భారత్‌కు ఆహ్వానం అందించాలని సిఫార్సు చేసింది. బలమైన నేతగా ఎదిగిన మోదీతో ప్రస్తుత దేశాధ్యక్షుడు బరాక్‌ ఒబామా అత్యున్నత స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని గుర్తుచేసింది.
వాతావరణ మార్పులు, సముద్ర భద్రత వంటి అంతర్జాతీయ సమస్యలపై పోరులో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుండటాన్ని స్వాగతిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రత మండలి(ఎన్‌ఎస్‌సీ)లో దక్షిణాసియా విభాగపు సీనియర్‌ సంచాలకుడు పీటర్‌ లవోయ్‌ వెల్లడించారు. సీఎస్‌ఐఎస్‌లో ఆయన మాట్లాడారు. గత ఎనిమిదేళ్లలో భారత్‌తో రక్షణ సంబంధాల్లో అపూర్వ ప్రగతి చోటుచేసుకుందన్నారు. మరోవైపు, భారత్‌తో ఒప్పంద కూటమి ఏర్పాటుచేసే అవకాశాలను లవోయ్‌ కొట్టిపారేశారు. 21వ శతాబ్దం ఒప్పంద కూటముల యుగం కాదని.. పరస్పర ప్రయోజనాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లో ఈ ఏడాది జరగాల్సిన సార్క్‌(దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం) సదస్సు వాయిదా పడటంపై విచారం లవోయ్‌ వ్యక్తంచేశారు. ఆసియాన్‌ వంటి కూటముల స్థాయిలో సామర్థ్యం మేరకు సార్క్‌ పనిచేయలేకపోయిందని వ్యాఖ్యానించారు.

ప్రధాని పిలుపుతో మార్పు...చైనా వస్తువులపై వ్యతిరేకత

ఒకప్పుడు చైనా వస్తువులకు ఆ బజార్ అడ్డా. దేశ రాజధానిలో ఉన్నా ఎక్కువగా చైనా ప్రాడెక్టులే లభించేవి. కానీ ఇప్పుడు అక్కడ ఒక్క చైనా వస్తువు కూడా కనిపించదు. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కానీ చైనా వస్తువులను స్వచంధంగా నిషేధించారు.
 
ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఆట వస్తువుల వరకు, పూలు ప్రమిదల నుంచి అలంకరణ సామాగ్రి వరకు, ఆభరణాలు మొదలు టపాసుల వరకు ఏదీ కావాలన్నా కేరాఫ్ అడ్రస్ ఢిల్లీ సదర్ బజార్. ఇక్కడ దొరకని వస్తువంటూ ఏదీ లేదు. మన దేశంలో తయారయ్యే వస్తువులతో పాటు విదేశీ వస్తువులు కూడా ఇక్కడ విక్రయిస్తారు. అది కూడా తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయిక్కడ. నిన్నమొన్నటి వరకు ఇక్కడ చైనా వస్తువులదే హవా. కానీ ప్రధాని మోదీ చేసిన ఒక్క విజ్ఞప్తితో ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు చైనా వత్తాసు పలుకుతోంది. అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది.
 
అక్కడి వస్తువులను మనదేశంలోకి చొప్పించి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని భావిస్తోంది. అందుకే చైనాకు దిమ్మ తిరిగేలా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. చైనా వస్తువులను బహిష్కరించాలని కోరారు. మోదీ విజ్ఞప్తితో ఢిల్లీ సదర్ బజార్‌లో చైనా వస్తువులను బహిష్కరించారు. చైనా వస్తువులను సదర్ బజార్ వ్యాపారస్తులు పూర్తిగా నిషేధించారు. మేక్ ఇన్ ఇండియా ప్రాడక్ట్స్‌ను మాత్రమే విక్రయిస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారు.
 
నష్టాలు వస్తున్నప్పటికీ మన సంపద మనకే ఉండాలి అనే నినాదంతో చైనా బ్రాండ్స్‌ను అమ్మడం లేదని అంటున్నారు. ప్రధాని విజ్ఞప్తితో ప్రజల్లో కూడా మార్పు కనిపిస్తోంది. స్వదేశీ వస్తువులనే కొంటున్నారు. గతేడాదితో పోల్చితే ఈ సారి లాభాలు కాస్త తగ్గినా స్వదేశీ వస్తువులు అమ్మడం ఆనందంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. చైనా బ్రాండ్స్‌ను పూర్తిగా నిషేధిస్తే దేశీయంగా తయారు చేసిన వస్తువులకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

దీపావళి నుంచి వజ్ర మినీ ఏసీ బస్సులు

ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు  కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది  రాష్ట్ర ఆర్టీసీ సంస్థ. ప్రయాణికుల దగ్గరకే బస్ వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులు బస్టాండ్లకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని సర్వేలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వజ్ర పేరుతో  దీపావళి నుంచి మిని ఏసీ బస్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఆర్టీసీ. మొదట విడతగా హైదరాబాద్ టూ వరంగల్, హైదరాబాద్ టూ నిజామాబాద్ రూట్లలో నిడిచేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు.  హైదరాబాద్ టూ వరంగల్ కు 300 రూపాయలు, హైదరాబాద్ టూ నిజామాబాద్ కు 350 రూపాయలు రేటు ఫిక్స్ చేశారు.
దీపావళి నుంచి ప్రారంభించే వజ్ర సర్వీస్ కు.. మొదటిగా 50 బస్సులను తర్వాత మరో 50 బస్సులను నడిపిస్తున్నామంటున్నారు అధికారులు. ఈ సర్వీస్ లో బస్సులో టికెట్ ఇవ్వరని …  టికెట్ల కోసం WWW.TSRTCONLINE.IN వెబ్ సైట్, బస్టాండ్లు, ఆర్టీసీ వాలెట్, ఎం-వాలెట్ తో టికెట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్ ను రూపొందిస్తున్నారు. గ్రూప్ బుకింగ్  చేసుకుంటే 10శాతం డిస్కౌంట్ కూడా అందజేస్తామంటున్నారు. ఇది సక్సెస్ అయితే.. గ్రామీణ ప్రాతాల్లో మరో 136 నాన్ ఏసీ బస్సులను ప్రవేశపెడతామంటున్నారు.
హైదరాబాద్ టూ వరంగల్ కు నాలుగు రూట్లు ఏర్పాట్లు చేశారు. ఒకటో రూట్ లోని బస్సులు  సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, నాగోల్ క్రాస్ రోడ్, ఉప్పల్ క్రాస్ రోడ్డు మీదుగా వరంగల్ చేరుకుంటాయి.  రెండో రూట్ వెళ్లే బస్సులు… మెహిదీపట్నం, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అంబర్ పేట్, ఉప్పల్ క్రాస్ రోడ్డు మీదుగా వరంగల్ కు చేరుకుంటాయి. . రూట్ నెంబర్ 3లో నడిచే బస్సులు కేపీహెచ్ బీ, బాలానగర్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ క్రాస్ రోడ్డు మీదుగా వరంగల్ వెళ్తాయి. రూట్ నెంబర్ 4లోని బస్సులు AS రావు నగర్, ESIL, హబ్సిగూడ, ఉప్పల్ క్రాస్ రోడ్డు చేరుకొని  వరంగల్ వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ రూట్లలో హైదరాబాద్ లో 100 బోర్డింగ్ పాయింట్లు, వరంగల్ లో 46 డ్రాపింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.
వరంగల్ నుంచి హైదరాబాద్ కు మూడు రూట్లు ఏర్పాటు చేశారు. ఒకటో రూట్ లోని  బస్సులు వరంగల్, బీఎస్ కాశీబుగ్గ, హన్మకొండ, కాజిపేట్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటాయి. రూట్ నెంబర్ 2..లో నడిచే బస్సులు పోచమ్మ మైదాన్, వరంగల్ చౌరస్తా, బస్ స్టేషన్, హంటర్ రోడ్, జులివాడ, సుబేదారి, కాజీపేట్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటాయి. రూట్ నెంబర్ 3లోని బస్సులు  కిషన్ పుర, భీమారం, గోపాలపురం, వాడెపల్లి చర్చ్, ఎక్సైజ్ కాలనీ, సుబేదారి, కాజీపేట్ మీదుగా హైదరాబాద్ కు చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
హైదరాబాద్ టూ నిజామాబాద్ కు మూడు రూట్లు ఏర్పాటు చేశారు. ఒకటో రూట్ వెళ్లే బస్సులు ఎల్ బీ నగర్, కొత్తపేట్, నాగోల్ క్రాస్ రోడ్, తార్నాక, సంగీత్, బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ మీదుగా నిజామాబాద్ చేరుకుంటాయి. రెండో రూట్ లో వెళ్లే బస్సులు కెపీహెచ్ బీ, బాలానగర్, బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ మీదుగా నిజామాబాద్ వెళతాయి. రూట్ నెంబర్ 3లోని బస్సులు మెహిదీపట్నం, ఎస్ఆర్ నగర్, బల్కంపేట్, బాలానగర్, బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ మీదుగా నిజామాబాద్ కు చేరుకుంటాయి.
నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కూడా మూడు రూట్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఒకటో రూట్ లో నడిచే బస్సులు ఆర్టీవో కార్యాలయం, నాగారం, ఓల్డ్ బస్ స్టేషన్, పులాంగ్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటాయి. రూట్ నెంబర్ రెండులోనిబస్సులు.. అర్సపల్లి, పీఎల్ డీ బస్ స్టేషన్, రైల్వేస్టేషన్, పులాంగ్ మీదుగా హైదరాబాద్ వస్తాయి. రూట్ నెంబర్ 3లోని బస్సులు  ముబారక్ నగర్, కంటేశ్వర్, సుభాష్ నగర్, న్యూ వినాయకనగర్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటాయి.
MGBS, జూబ్లీ బస్టాండ్ల నుంచి రెగ్యులర్ బస్సులు ఉండటంతో.. ఈ బస్సులు అటూ వైపు వెళ్లయంటున్నారు అధికారులు. కొత్తగా చేపడుతున్న ఈ ప్రణాళికతో ఆర్టీసీకి లాభాల సిరులు కురిపిస్తాయని చెబుతున్నారు.

భూగర్భ జలాలు పెరిగాయి

రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. రెండేళ్లుగా ప్రతీ నెలా సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు కురవగా… ఈ  సెప్టెంబర్ లో మాత్రం అనూహ్యంగా అదనపు వర్షపాతం కురిసింది. సెప్టెంబర్ లో సాధారణ వర్షపాతం 715 మిల్లీమీటర్లు కాగా..ప్రస్తుతం ఏకంగా 943 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 32 శాతం అధిక అధిక వర్షపాతం నమోదైనట్లు భూగర్భ జల విభాగం తెలిపింది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. మిగిలిన జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అధికంగా హైదరాబాద్ లో 60 శాతం, రంగారెడ్డిలో 48, మెదక్ 43, నిజామాబాద్ లో 42, నల్లగొండలో 37, వరంగల్  లో 33, మహబూబ్ నగర్ లో 24, కరీంనగర్ లో 21 శాతం అధికంగా వర్షాలు కురిశాయి.ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో గణనీయంగా భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే సగటున 6.64 మీటర్ల మేర వృద్ధి ఉన్నట్లు నివేదిక తెలిపింది.  ఆగస్టుతో పోలిస్తే 3.49 మీటర్లు.గతేడాదితో పోలిస్తే 2.76 మీటర్ల వరకు భూగర్భ మట్టాలు పెరిగాయి. రాష్ట్రంలో 65 మండలాల్లో 2 మీటర్లలోనే భూగర్భ జలాలుండగా..70 మండలాల్లో 2 నుంచి 5 మీటర్లలో నీటి లభ్యత ఉంది. 95 మండలాల్లో 5 నుంచి10 మీటర్ల లోపు …113 మండలాల్లో 10 నుంచి 20 మీటర్లలోపు నీటి లభ్యత ఉంది. ఇక 56 మండలాల్లో 20 మీటర్ల కింద జలాలున్నాయి.

సెకనుకు 100 ఎంబిపిఎస్‌ స్పీడ్‌

టెలికాం రంగంలో పట్టును నిలుపుకునేందుకు గాను భారతి ఎయిర్‌టెల్‌ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వినియోగదారుల కోసం ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించిన ఎయిర్‌టెల్‌ తాజాగా వి-ఫైబర్‌ టెక్నాలజీతో సెకనుకు 100 మెగాబిట్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లతో పాటు పాత కస్టమర్లకు ఈ సేవలను అందించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుత కస్టమర్లు.. తాము ఉన్న ప్లాన్‌లోనే వి- ఫైబర్‌ స్పీడ్‌కు అప్‌గ్రేడ్‌కు కావటం ద్వారా ఈ స్పీడ్‌ను అందుకోవచ్చని తెలిపింది. ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీలు విధించబోవటం లేదని పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో వినియోగదారులు తాము అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి చెందకపోతే మోడెమ్‌ చార్జీలను పూర్తిగా చెల్లించనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది.

అవుతారా.. మీరూ అంబానీ!


అనంత్‌ అంబానీ... 18 నెలల్లో 108 కిలోలు తగ్గిన కుర్రాడు. యువతకు తాజా రోల్‌మోడల్‌. అంతులేని సంపద... అందుబాటులో అన్ని సౌకర్యాలు... ఇవేవీ అతడ్ని నాజూగ్గా తయారు చేయలేకపోయాయి. కేవలం కఠోరమైన శ్రమే లక్ష్యాన్ని చేర్చింది. అతగాడి అనుభవం నుంచి పాఠాలు నేర్చితే మనమూ ఏదైనా సాధించొచ్చు.

ప్రయోజనం 
ప్రతి పనికీ ఒక పర్పస్‌ ఉంటుంది బాస్‌. బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఉండొద్దా? నాకూ ఒక లవర్‌ ఉండాలి... వచ్చే పుట్టినరోజుకల్లా స్లిమ్‌గా తయారవ్వాలి... ఇలా ఏదో ఒక లక్ష్యం నిర్దేశించుకోండి. నిత్యం అదే స్మరించండి. అనంత్‌ సైతం 21వ బర్త్‌డేకి బరువు తగ్గాలని లక్ష్యం పెట్టుకొని కసరత్తులు ప్రారంభించాడు.

దేనికైనా సిద్ధం
ముఖేష్‌ అంబానీ కొడుకు కదా... బాగా డబ్బులున్నాయి కదాని అనంత్‌ ఒంట్లోని కేలరీలు వూరికే కరిగిపోలేదు. చాలా కష్టపడ్డాడు. రోజూ 21 కిమీలు నడిచాడు. రోజుకు ఐదారుగంటలు జిమ్‌లో గడిపాడు. నచ్చింది మానేసి నచ్చని ఆహారాన్నే ఇష్టంగా తిన్నాడు. నొప్పుల్ని పంటి బిగువున భరిస్తూ శిక్షకులు చెప్పింది విన్నాడు. ఇలాంటి కష్టానికి మీరూ సిద్ధమైతే బరువు కరిగించడం కష్టమేం కాదు.

తోడుండాలి 
లక్ష్యం కొండలా ఉంటే అనుక్షణం ప్రోత్సహించేవారు పక్కన ఉండేలా చూసుకోవాలి. అప్పుడు సగం భారం తప్పినట్టే. తల్లి నీతా అనుక్షణం అనంత్‌ వెంటే ఉండేది. అతడు ఏం తింటే అదే తినేది. కలిసి వ్యాయామాలు చేసేది. మనకూ అలా స్ఫూర్తిపంచే వారుంటే లక్ష్యం సునాయసమే.

టెక్నాలజీ వాడండి 
ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌, వ్యాయామాల్ని కొలిచే యాప్స్‌... మార్కెట్లో బోలెడు దొరుకుతున్నాయి. వీటి సాయంతో ఏమేం తినాలో తెలుసుకోవచ్చు. ఎంత వ్యాయామం చేశామో, ఎంత చేయాల్సి ఉందో లెక్కలు వేసుకోవచ్చు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటే లక్ష్యాన్ని దగ్గర చేసే ఇంకో సన్నిహితుడు దొరికినట్టే. అనంత్‌ కూడా ఈ టెక్నాలజీని బాగా వాడుకున్నాడు.

పగిలిన మనసుల మ్యూజియం

పురాతన వస్తువులు, అద్భుతమైన కళాఖండాలు భద్రపరచేది మ్యూజియం అని అందరికీ తెలుసు. క్రొయేషియాలోని జగ్రెబ్‌లోనూ ఓ మ్యూజియం ఉంది. దీని కథే వేరు. ఇందులో ఉండే వస్తువులన్నీ ప్రేమికుల ప్రేమకు గుర్తుగా ఇచ్చిపుచ్చుకున్న నజరానాలు. కాకపోతే వారి బంధం బెడిసికొట్టాకే ఇక్కడకు చేరతాయి.
సూటిగా విషయానికొస్తే.. ఒలింకా విస్టికా, డ్రేజెన్‌ గ్రుబ్సిక్‌ ప్రేమికులు. నాలుగేళ్లు గాఢంగా ప్రేమించుకున్నాక ఏవో తేడాలొచ్చి విడిపోయారు. మరి ఇన్నాళ్లుగా ఇచ్చిపుచ్చుకున్న బహుమతుల సంగతేంటి అనుకుంటుంటే ‘ఓ మ్యూజియం పెట్టేస్తో పోలా?’ అంది ఒలింకా. డ్రేజెన్‌ సీరియస్‌గా తీసుకున్నాడు. ప్రేమ కానుకలన్నీ ఒక్కచోటికి తెచ్చాడు. తమలా బ్రేకప్‌ చెప్పుకున్న స్నేహితుల నుంచి కూడా ఆ ఇద్దరూ ప్రేమకానుకలు సేకరించారు.
వాటన్నింటితో కలిపి 2006లో తొలిసారి ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మేం కలిసి ఉన్నపుడు మా ప్రేమకు గుర్తులివిగో అని చాటింపు వేస్తే ఎవరికైనా ఆసక్తే కదా! జనం విరగబడి చూశారు. ఇదేదో బాగుందనుకొని ఆ వస్తువులతో అర్జెంటీనా, బోస్నియా అండ్‌ హెర్జెగొవినా, జర్మనీ, మాసిడోనియా, ఫిలిప్పీన్స్‌, సెర్బియా, సింగపూర్‌, స్లొవేనియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్‌, అమెరికాలు చుట్టొచ్చారు. ఈ అపురూప కానుకల్ని లక్షలమంది వీక్షించారు. వేలి ఉంగరాల నుంచి కాలికి వేసుకునే చెప్పుల దాకా.. అన్నీ ఈ విచిత్ర మ్యూజియమ్‌లో ఉన్నాయ్‌. దుస్తులు, ఉత్తరాలు, సెల్‌ఫోన్లు, ఫొటోఫ్రేమ్‌లు, బొమ్మలు, దుస్తులు, మేగజైన్లు, నగ్న చిత్రాలు, బొకేలు, ఆఖరికి లోదుస్తులు సైతం ప్రదర్శనకు పెట్టారు. ఓ సుందరి అయితే బ్రేకప్‌ తర్వాత తన ప్రేమికుడు ఇచ్చిన బహుమానాలన్నీ బద్ధలు కొట్టేసి ఆ గొడ్డలిని ఈ మ్యూజియానికి ఇచ్చేసింది. ఇలాంటి అరుదైనవి మూడువందలపైనే ఉన్నాయి. ప్రేమలో ఉన్నపుడు కలిగే భావోద్వేగాలు, అనుబంధాలు, మధుర జ్ఞాపకాల్ని మరోసారి గుర్తు చేసుకోవడానికే మా ఈ ప్రయత్నం అంటున్నారు ఆ మాజీ ప్రేమికులు. అన్నట్టు ఇది ఐరోపాలోనే అత్యంత వినూత్నమైన మ్యూజియంగా కెన్నెత్‌ హడ్సన్‌ అవార్డు గెల్చుకుంది.

దేవ దేవుడు.. శ్రీ వేంకటేశుడు


‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’
బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీనివాసుడికి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ.. అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు... ఇదీ శ్లోకానికి అర్థం.
తిరుమల పుణ్యక్షేత్రం ‘కలియుగ వైకుంఠ’మని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూలకారణం.. స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీవేంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని.. ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉన్నారు. ఆనందనిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి ‘ఆనంద నిలయ’మనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది.
స్థలపురాణం
కలియుగారంభంలో... అనగా సుమారు 5వేల సంవత్సరాల క్రితం.. వక్ష స్థల మహాలక్ష్మి సమేతంగా ఆవిర్భవించిన శ్రీనివాసునికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, గోపుర, ప్రాకార, మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. వేంకటపతికి నిత్యోత్సవ, వార్షికోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నారాయణవనం అధిపతులు ఆకాశరాజు, తొండమాన్‌ చక్రవర్తి, పల్లవరాణి సామవై, విజయనగర సామ్రాజ్యాధీశులు సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, తిరుమలరాయలు, అచ్యుతరాయలు ఇలా.. ఎందరో మహానుభావులు.. ఇక్కడ అద్భుత నిర్మాణాలను చేపట్టి అపూర్వసేవా కైంకర్యాల నెలవుగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దారు.
శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన వరాహస్వామివారిని దర్శించుకోవాలని స్థలపురాణంలో ఉంది. అలాగే స్వామి వారి దర్శనానంతరం... తిరుపతిలో పద్మావతి/బీబీనాంచారి/అలివేలుమంగ అమ్మవారిని, గోవిందరాజస్వామి వారిని దర్శించుకోవాలి. తిరుమలగిరులలో ఉన్న పవిత్ర ఆకాశగంగ.. పాపనాశనం.. వకుళమాత ఆలయం,, హాథీరాంజీ మఠం.. త్రిదండి జీయర్‌స్వామివారి మఠం..వన్యప్రాణుల పార్క్‌.. వంటి ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాశస్త్యమున్న ప్రాంతాల్ని దర్శించుకోవచ్చు. తితిదే బస్సు సర్వీసులతో పాటు ఆయా ప్రదేశాలకు ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. తలనీలాలు మొక్కుబడి ఉన్నవారు తప్పనిసరిగా స్వామివారి ‘కల్యాణకట్ట’ వద్దనే తలనీలాలు సమర్పించాలి
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన వేళలు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక దర్శనవేళలు ఒక్కోరోజు ఒక్కోవిధంగా ఉంటాయి. స్వామివారికి జరిగే నిత్య, వారపు సేవలను బట్టి ఆయా సమయాలను తితిదే నిర్దేశించింది. టిక్కెట్లను ముందస్తుగా అంతర్జాలం, ఈ-దర్శన్‌, తపాలా శాఖ ద్వారా విక్రయిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రంలోపు నిర్దేశించిన సమయంలోపు శ్రీవారిని దర్శించుకునే వేళలను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న సమయం టిక్కెట్టుపై ముద్రితమవుతుంది. ఈ సమయానికి మాత్రమే ఆలయానికి చేరుకోవడానికి వరుస వద్దకు రావాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నిత్యం రూ.300 ధర వంతున 26వేల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 56 రోజులకు ముందుగా టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. విశేష పర్వదినాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ల సంఖ్యను దేవస్థానమే తగ్గిస్తుంది.
తితిదే ప్రకటించిన వేళల వివరాలివీ:
వారంసమయం
ఆదివారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
సోమవారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
మంగళవారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 7 గం. వరకు
బుధవారంఉదయం 10గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
గురువారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 4గం. వరకు
శుక్రవారంఉదయం 10గం. నుంచి సాయంత్రం 4గం. వరకు
శనివారంఉదయం 7 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు
వృద్ధులకు, వికలాంగులకు దర్శన వేళలు:శ్రీవారి దర్శనానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు తితిదే ప్రత్యేక ప్రవేశ అవకాశం కల్పిస్తోంది. మందిరం మహాద్వారం సమీపం నుంచి ఆలయంలోకి చేరుకునే సౌలభ్యం కల్పించింది. నిత్యం ఉదయం 10, మధ్యాహ్నం 3గంటలకు ఆలయ ప్రవేశాలకు అనుమతిస్తుంది. ఈ దర్శన సమయాల కన్నా గంట ముందుగా ఆయా భక్తులు పరిశీలనకు హాజరవ్వాల్సి వుంటుంది. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు వయస్సు ధ్రువీకరణ పత్రం ఆధారంగా అనుమతిస్తారు. నడవలేని పరిస్థితిలో ఉన్నవారి వెంట సహాయకులను అనుమతిస్తారు. వికలాంగులు, గుండె జబ్బుతో ఆపరేషన్‌ చేసుకున్న భక్తులను వైద్యులు జారీచేసి పత్రాల పరిశీలన అనంతరం అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాలు వంటి విశేష పర్వదినాల్లో ఈ దర్శనాలను తితిదే రద్దు చేస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తితిదే ముందుగానే ప్రకటిస్తుంటుంది.
తిరుపతి-తిరుమలకు ప్రయాణ సదుపాయాలు
తిరుమల, తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు రోడ్డు.. రైలు.. ఆకాశ మార్గాల్లో విస్తృతమైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకునే భక్తులకు స్టేషన్‌ ఎదురుగానే కొండపైకి తీసుకెళ్లే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి తిరుమలకు ప్రతి నిమిషానికో బస్సు చొప్పున బ్రహ్మోత్సవాల సమయంలో నడుస్తుంటాయి. ప్రీపెయిడ్‌ ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.
రేణిగుంట విమానాశ్రయం నుంచి నిత్యం మధ్యాహ్నం ఒక ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ సర్వీసు నిర్వహిస్తున్నారు. ఈ బస్సు తిరుమల నుంచి ఉదయం 11 గంటలకు బయల్దేరి.. రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం 12.30 నిమిషాలకు చేరుతుంది. తిరిగి విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుమలకు బయల్దేరుతుంది. విమానాశ్రయంలో ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. తిరుపతి కేంద్రంగా ఉన్న ట్రావెల్‌ కంపెనీలకు సమాచారం ఇచ్చే పక్షంలో వాహనాలను సమకూర్చుతారు. అన్ని రకాల సొంత వాహనాలనూ తిరుమల వెళ్లేందుకు తితిదే అనుమతిస్తోంది. అలిపిరి భద్రతా వలయంలో తనిఖీలు నిర్వహించుకున్న అనంతరం టోల్‌ రుసుం చెల్లించి ఆయా వాహనాల్లో తిరుమలకు రావాల్సి ఉంటుంది. అన్ని రకాల వాహనాలు అలిపిరి నుంచి తిరుమలకు రెండో కనుమ రహదారిలో 28 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తితిదే వేగ నియంత్రణ చర్యలు చేపట్టింది. అదేవిధంగా తిరుమల నుంచి తిరుపతికి మొదటి కనుమ రహదారిలో ప్రయాణ సమయం 45 నిమిషాలు తీసుకోవాల్సి వుంటుంది. నిర్దేశిత సమయం కంటే ముందుగా వచ్చే పక్షంలో సంబంధిత వాహనాలను తిరుమలకు 10 రోజులపాటు రాకుండా నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంటారు! రెండోసారి కూడా నిబంధనలు పాటించని పక్షంలో జరిమానా విధిస్తారు. సమయాన్ని లెక్కించడానికి అలిపిరి భద్రతావలయంలో వాహనదారులకు తితిదే బార్‌ కోడింగ్‌ రశీదులను జారీ చేస్తుంది.
కాలినడకన వెళ్లే భక్తుల కోసం
అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాలినడకన రావడానికి తితిదే అనుమతిస్తుంది. అలిపిరి నుంచి 24 గంటల సమయం, శ్రీవారి మెట్టు ల నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది. గరుడోత్సవం సమయంలో 24 గంటల సమయం అనుమతించాలని నిర్ణయించింది. అడవి జంతువులను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి మెట్టు మార్గంలో పగటి సమయంలో మాత్రమే భక్తుల రాకపోకలకు అనుమతిస్తున్నారు. వీరికి మార్గమధ్యంలో దివ్యదర్శనం టోకెన్లను తితిదే ఉచితంగా జారీ చేస్తుంది. టోకెన్లను పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం ఉచితంగా కల్పించడంతో పాటు ఒక లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తారు. రెండు లడ్డూలు కావాలంటే రూ. 10 చొప్పున రాయితీపై అందజేస్తారు. అవసరమైన వారు రూ. 25 ధరపై మరో రెండు లడ్డూలూ పొందవచ్చు. భక్తుల లగేజీని తితిదేయే తిరుమలకు ఉచితంగా చేరవేస్తుంది. అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రవేశమార్గంలో ఈ ఉచిత లగేజీ రవాణా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ భక్తులు తమ లగేజీని డిపాజిట్‌ చేసి రశీదు చూపి ఈ లగేజీని తీసుకోవచ్చు.
బ్రహ్మోత్సవాల సమయంలో తితిదే ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను కరెంటు బుకింగ్‌ కింద ఇవ్వడాన్ని రద్దు చేస్తుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ కింద నిత్యం అంతర్జాలంలో 6వేలు, ఇ-దర్శన కౌంటర్ల ద్వారా మరో 5వేల టికెట్లను రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. టికెట్లలో నిర్దేశించిన సమయానికి ఆయా భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారి దర్శనానికి హాజరుకావాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు, సంప్రదాయ దుస్తులు ధరించని పక్షంలో శ్రీవారి దర్శనానికి అనుమతించరు. ఒక్కో టికెట్‌పై రెండు ప్రసాద లడ్డూలు ఉచితంగా అందజేస్తారు.
తిరుమలలో భక్తులందరికీ తితిదే స్వామివారి అన్నప్రసాదం అందజేస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో ఉదయం 9.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సిఫార్సు లేకుండా ప్రతిఒక్కరూ ఈ అన్న ప్రసాదాన్ని ఉచితంగా స్వీకరించవచ్చు. బ్రహ్మోత్సవాల్లో రద్దీ ప్రాంతాలను గుర్తించి అక్కడే భక్తులకు అల్పాహారం, పానీయాలనూ అందించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది.
వసతి సౌకర్యం
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 24 గంటలపాటు ఉచిత వసతి కల్పిస్తారు. తితిదే ఆధ్వర్యంలో తిరుపతి-తిరుమల ప్రాంతాల్లో సుమారు 15వేల కాటేజ్‌లు భక్తుల కోసం అందుబాటులో ఉన్నాయి. హాథీరాంజీ మఠం, జీయర్‌ మఠం, శంకరమఠం తదితర సంస్థల ఆధ్వర్యంలోనూ వసతి లభిస్తుంది.
ఇవికాక ఆర్జితసేవలు పొందేవారి కోసం ప్రత్యేక కాటేజ్‌లు ఉన్నాయి. అలాగే వివిధ రాష్ట్రాల టూరిజం శాఖల అతిథిగృహాలు, వివిధ ఆధ్యాత్మిక సంస్థల అద్దెగదులు అందుబాటులో ఉన్నాయి. ముందస్తు రిజర్వేషన్‌, ఇతర వివరాలకు తితిదే కార్యాలయంలో సంప్రదించాలి
ఆర్జితసేవ పేరుహాజరు కావాల్సిన సమయం
సుప్రభాతంఉదయం 2 గంటలకు
వస్త్రాలంకరణ సేవఉదయం 3 గంటలకు
అభిషేకంఉదయం 3 గంటలకు
తోమాలఉదయం 3గంటలకు
అర్చనఉదయం 4గంటలకు
నిజపాద దర్శనంఉదయం 4.30గంటలకు
అష్టదళ పాద పద్మారాధన సేవఉదయం 5 గంటలకు
సహస్ర కలశాభిషేకంఉదయం 5గంటలకు
తిరుప్పావడ సేవఉదయం 5గంటలకు
విశేషపూజఉదయం 6గంటలకు
కల్యాణోత్సవంఉదయం 10గంటలకు
వూంజలసేవఉదయం 11గంటలకు
ఆర్జిత బ్రహ్మోత్సవంమధ్యాహ్నం 1.30గంటలకు
వసంతోత్సవంమధ్యాహ్నం 2గంటలకు
సహస్ర దీపాలంకరణ సేవసాయంత్రం 5గంటలకు
ప్రధాన/ ప్రత్యేక పూజలు:
నిత్యసేవలు: సుప్రభాతం
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ. 120
నిత్యసేవలు: తోమాల
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళ, బుధ, గురుటిక్కెట్టు ధర: రూ.220
నిత్యసేవలు: అర్చన
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళ, బుధ, గురుటిక్కెట్టు ధర: రూ.220
నిత్యసేవలు: కల్యాణోత్సవం
ప్రవేశం: ఇద్దరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ. 1000
నిత్యసేవలు: ఆర్జిత బ్రహ్మోత్సవం
ప్రవేశం: ఒకరికి రోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: డోలోత్సవం
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: సహస్ర దీపాలంకరణ సేవ
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: వారం సేవలు విశేషపూజ
ప్రవేశం: ఒకరికిరోజు: సోమవారంటిక్కెట్టు ధర: రూ.600
నిత్యసేవలు: అష్టదళ పాదపద్మారాధనం
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళవారం టిక్కెట్టు ధర: రూ. 1,250నిత్యసేవలు: సహస్ర కలశాభిషేకం
ప్రవేశం: ఒకరికిరోజు: బుధవారంటిక్కెట్టు ధర: రూ.850
నిత్యసేవలు: తిరుప్పావడ సేవ
ప్రవేశం: ఒకరికిరోజు: గురువారంటిక్కెట్టు ధర: రూ.850
నిత్యసేవలు: అభిషేకం
ప్రవేశం: ఒకరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ.750
నిత్యసేవలు: నిజపాద దర్శనం
ప్రవేశం: ఒకరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: వస్త్రాలంకరణ సేవ
ప్రవేశం: ఇద్దరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ. 12,250

ఆ సినిమా ‘బాహుబలి 2’కి పోటీ కాదు


‘సన్స్‌ ఆఫ్‌ సర్దార్‌’ చిత్రం ‘బాహుబలి 2’కి పోటీకాదని బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవగణ్‌ అన్నారు. ‘శివాయ్‌’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సన్స్‌ ఆఫ్‌ సర్దార్‌’. సరగర్హి యుద్ధం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ తరహాలో ఇండియాలోనే పెద్ద యుద్ధ చిత్రంగా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు అజయ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటి వరకు దేశం నుంచి ‘బాహుబలి’ చిత్రం మాత్రమే యుద్ధ నేపథ్యంలో భారీగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ఈ చిత్రానికి కొనసాగింపుగా తీస్తున్న ‘బాహుబలి 2’ కూడా విడుదలకు సిద్ధమౌతోంది. అయితే ‘సన్స్‌ ఆఫ్‌ సర్దార్‌’.. ‘బాహుబలి’ స్థాయిలో ఉంటుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు అజయ్‌ సమాధానం ఇచ్చారు.
‘ఒక్కసారి మనం ‘బాహుబలి 2’ చూద్దాం, ‘సన్స్‌ ఆఫ్‌ సర్దార్‌’ని దాని కన్నా పెద్దగా తీయడానికి నేను స్ఫూర్తి పొందుతానేమో. ఇది మా మధ్య పోటీ కాదు, స్ఫూర్తి మాత్రమే’ అని అజయ్‌ అన్నారు. ‘సన్స్‌ ఆఫ్‌ సర్దార్‌’ చిత్రం షూటింగ్‌ వచ్చే ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. 2018 ముగింపులో దీన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల జాబితాను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

శ్రీ రాఘవేంద్రస్వామి


భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం- శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు.. పర్యాటకులు వస్తుంటారు.
క్షేత్రచరిత్ర/స్థల పురాణం: మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం. మంచాల గ్రామంగా పిలిచేవారు. ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూల రాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీమహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వవతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ (రేణుకాంబ రూపిణి) రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉంచాలని ఆజ్ఞాపించిందట! దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులు అయ్యారు. అప్పటి నుంచి నిత్యం రాఘవేంద్రస్వామి మూల బృందావననానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతారు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని... అనంతరం రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకొంటారు.
చరిత్ర విశేషాలు: తమిళనాడు-భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు (రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే!) 1595లో జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి.. ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని.. సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12ఏళ్లపాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ.
అనంతరం పవిత్ర తుంగభద్ర నదీతీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు. ఆదోని నవాబు సిద్ధిమసూద్‌ఖాన్‌ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్రస్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చెయ్యాలంటూ దివాన్‌ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట! త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు ఏడుగంటలపాటు విశ్రాంతినిచ్చిందని.. ఆ మేరకు 700 ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి పొందారు.
ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు: కర్ణాటక సరిహద్దులోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం: ఇక్కడే రాఘవేంద్రస్వామి 12 ఏళ్లపాటు తపస్సు చేశారట! నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపమే ఇక్కడ చూడొచ్చు.
పాతూరు: రాఘవేంద్రస్వామి మొదట ఈ గ్రామానికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారట. ఇక్కడ స్వామి వారి విగ్రహాన్ని స్వయంగా రాఘవేంద్ర స్వామివారే చెక్కారట!
* వెంకన్న ఆచారి ఏకశిలా బృందావనం: రాఘవేంద్రస్వామి ప్రధాన శిష్యుడు వెంకన్న ఆచారి వద్ద రాఘవేంద్రస్వామి రెండు సంవత్సరాలు ఉన్నారట. ఆ మేరకు ఈ వెంకన్నే స్వామివారికి ఏకశిలతో బృందావనం కట్టించారు.
* రాఘవేంద్రస్వామి దర్శనానంతరం భక్తులకు ప్రత్యేకంగా పరిమళ ప్రసాదం అందిస్తారు. రూ. 20కి 4 ముక్కలు ఇస్తారు. ఇది ఇక్కడి ప్రత్యేక ప్రసాదం.
దర్శనవేళలు: రోజూ ఉదయం 6 గంటల నుంచి 8.30 వరకూ దర్శనానికి అనుమతిస్తారు. మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి ఉ. 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు. తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనం. ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు.
భక్తులందరికీ ఉచిత నిత్యాన్నదానం ఉ. 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉంటుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ రూ. 2కు పులిహోర, పెరుగు అన్నం ఇస్తారు.
మఠంలో ప్రధాన పూజలు: 1. సంపూర్ణ అన్నదాన సేవ: ఒకరోజు సంపూర్ణ అన్నదాన సేవకోసం రూ. 2లక్షలు చెల్లించాలి. ఈ సేవకు 10మందిని అనుమతిస్తారు. 99 పరిమళ ప్రసాదాలు వస్త్రం, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక ఇస్తారు. ఒకరోజు వసతి కల్పిస్తారు. ఏడాదిలో ఎప్పుడైనా ఒకరోజు ముందే శ్రీమఠంలో నమోదు చేసుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే పూజల్లో పాల్గొనవచ్చు.
2. సమర్పణ సేవ: ఒక రోజు సమర్పణ సేవకు రూ. లక్ష చొప్పున చెల్లించాలి. పదిమందిని అనుమతిస్తారు. 99 పరిమళ ప్రసాదాలు, వస్త్రం, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక ఇస్తారు. ఒక రోజు వసతిసౌకర్యం ఉంటుంది. ఎప్పుడైనా ఒకరోజు ముందే శ్రీమఠంలో నమోదు చేసుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రివరకూ జరిగే పూజల్లో పాల్గొనవచ్చు.
3. వస్త్ర సమర్పణ సేవ: వస్త్ర సమర్పణ సేవకు రూ.50 వేలు రుసుం. అన్ని బృందావనాలతో పాటు పీఠాధిపతికి పట్టు వస్త్రాలు ఇస్తారు. పదిమందిని అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, వస్త్రం, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక ఇస్తారు. భక్తులు ఒకరోజు ముందే మఠానికి చేరుకోవాలి. పూజకు ముందురోజూ, సాయంత్రం పట్టువస్త్రాలను భక్తులతో వూరేగింపుగా తీసుకొస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే అన్ని పూజల్లో పాల్గొనవచ్చు. వసతి సౌకర్యం కల్పిస్తారు. ఒకరోజు ముందే ఈ పూజ కోసం నమోదు చేసుకోవాలి.
4. పట్టువస్త్ర సమర్పణ సేవ: ఇది రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి, పీఠాధిపతికి మాత్రమే. ఇందులో పాల్గొనేందుకు రూ. 25వేలు చెల్లించాలి. 10మందిని అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక అందజేస్తారు. ఒకరోజు ముందు శ్రీమఠానికి చేరుకోవాలి. ముందురోజు సాయంత్రం పట్టువస్త్రాలు వూరేగింపుగా తీసుకొస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే అన్ని పూజల్లో పాల్గొనవచ్చు. ఒకరోజు వసతి సౌకర్యం కల్పిస్తారు.
5.బంగారు పల్లకి సేవ: మఠంలో బంగారు పల్లకి సేవలో పాల్గొనేందుకు రూ. 8వేలు రుసుం చెల్లించాలి. రోజుకు 10 మందిని మాత్రమే అనుమతిస్తారు. 25 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం ఇస్తారు. ఉదయం 9.30 గంటలకు పూజ జరుగుతుంది. గంట ముందే శ్రీ మఠానికి చేరుకోవాలి.
6. బంగారు రథోత్సవ సేవ: బంగారు రథోత్సవ సేవకు రూ. 6వేలు చెల్లించాలి. రాత్రి 7.30 గంటలకు ఈ సేవ జరుగుతుంది. 10మందిని అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం ఇస్తారు. అదేరోజు సాయంత్రం గంట ముందు శ్రీమఠానికి చేరుకోవాలి.
7. కనక కవచ సమర్పణ సేవ: కనక కవచ సమర్పణ సేవకు రూ. 3,500 రుసుం. 8 మందిని అనుమతిస్తారు. 25 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం ఇస్తారు. ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. గంట ముందు మఠానికి చేరుకోవాలి.
8. రజత రథోత్సవ సేవ: ఈ రజత రథోత్సవ సేవలో పాల్గొనదల్చిన భక్తులు రూ. 2 వేలు రుసుంగా చెల్లించాలి. ఆరుగురిని అనుమతిస్తారు. 25 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రాలు ఇస్తారు. రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. గంట ముందు మఠానికి చేరుకోవాలి.
9. రథోత్సవ(చెక్క)సేవ: (చెక్క) రథోత్సవ సేవ కోసం భక్తులు రూ. 1000 చెల్లించాలి. రాత్రి 7.30కి ఈ సేవ నిర్వహిస్తారు. నలుగురికి అనుమతి ఉంటుంది. 20 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, శాలువా ఇస్తారు. దీనికి ముందురోజే నమోదు చేసుకుని మఠానికి చేరుకోవాలి.
10. కనక మహాపూజ: ఈ పూజ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. రూ. 750 చెల్లించాలి. నలుగురిని అనుమతిస్తారు. 20 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం అందజేస్తారు.
11.పూర్ణసేవ: పూర్ణసేవ రోజూ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు రూ. 500 చెల్లించాలి. నలుగురిని అనుమతిస్తారు. 15 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం అందజేస్తారు.
12. మహాపూజ: మహాపూజ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. దీనికోసం భక్తులు రూ. 350 చెల్లించాలి. ముగ్గురిని అనుమతిస్తారు. 10 పరిమళ ప్రసాదాలు, వస్త్రం ఇస్తారు. గంట ముందు మఠంలో ఉండాలి.
13. సర్వసేవ: సర్వసేవ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు రూ. 250 చెల్లించాలి. ఇద్దరిని అనుమతిస్తారు. 10 పరిమళ ప్రసాదాలు, వస్త్రం బహుమతిగా ఇస్తారు. సేవకు గంట ముందు మఠంలో ఉండాలి.
14. ఉత్సవరాయ పాదపూజ: ఉత్సవరాయ పాదపూజ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. రూ. 200 చెల్లించాలి. ఇద్దరికీ అనుమతి ఉంటుంది. వస్త్రం ఇస్తారు. పూజకు ముందుగానే హాజరవ్వాలి.
15 ఫల పంచామృతాభిషేకం: ఫల పంచామృతాభిషేకం ఉదయం 8.30 గంటలకు జరుగుతుంది. రూ. 150 చెల్లించాలి. ఇద్దరిని అనుమతిస్తారు. వస్త్రం ఇస్తారు.
16. పంచామృత సేవ: ఉదయం 8.30 గంటలకు జరుగుతుంది. రూ. 75 చెల్లించాలి. ఇద్దరిని అనమతిస్తారు. వస్త్రం ఇస్తారు.
17. శ్రీవాయుస్తుతి పునశ్చరణ సేవ: బృందావనానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామికి ఈ సేవ చేస్తారు. ఇది ప్రతి శుక్రవాం మాత్రమే ఉదయం 7.30 ఉంటుంది. రూ. 500 చెల్లించాలి. నలుగురిని అనుమతిస్తారు. 10 పరిమళ ప్రసాదాలు, వస్త్రం ఇస్తారు.
18. శ్రీవాయుస్తుతి పునశ్చరణ(శుద్ధోదక): ఆదివారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం 7.30కు నిర్వహిస్తారు. రూ. 200 చెల్లించాలి. ఇద్దరికి అనుమతి ఉంటుంది. నాలుగు పరిమళ ప్రసాదాలు, వస్త్రం ఇస్తారు.
19. శ్రీ సత్యనారాయణ స్వామిపూజ: ఉదయం 9 గంటలకు జరుగుతుంది. రూ. 200 చెల్లించాలి. వస్త్రం ఇస్తారు.
20 సామూహిక సత్యనారాయణ స్వామిపూజ: పౌర్ణమిరోజు మాత్రమే చేస్తారు. రూ. 50 చెల్లించాలి. ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ఈ పూజలో పాల్గొనేందుకు పౌర్ణమికి ముందు రోజు నమోదు చేసుకోవాలి.
21. గోదాన సేవ: ఉదయం 9 నంచి 12 వరకూ ఉంటుంది. రూ. 5 వేలు చెల్లించాలి. కుటుంబం మొత్తం అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి మఠం జ్ఞాపిక ఇస్తారు.
* ఆయా ఆర్జిత సేవలను భక్తులు ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు లేదా నేరుగా శ్రీ మఠానికి వచ్చి.. బుక్‌ చేసుకోవచ్చు.
మఠంలో వసతి.. ఇతర సౌకర్యాలు: ఇక్కడ భక్తుల కోసం నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. రోజు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ అన్న ప్రసాద వితరణ ఉంటుంది. రాత్రి భోజనంగా రూ. 2కు పెరుగన్నం.. చిత్రాన్నం ఇస్తారు. మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో 500 గదులున్నాయి. ఇవికాక కర్ణాటక, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన పలు గెస్ట్‌హౌస్‌ల్లోనూ గదులు అందుబాటులో ఉంటాయి.
అదనపు సమాచారం:  రూ. 8 వేల నుంచి రూ. 2లక్షల వరకు విరాళంగా అందించే వారికి ఇక్కడ వసతి సౌకర్యం కల్పిస్తారు. 
* ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలుండవు. కేవలం ఉచిత దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. 
* ద్వాదశి, ఆరాధనోత్సవాల సమయంలో పూజ వేళల్లో మార్పులుంటాయి. మిగతారోజుల్లో సాధారణమే.