ఆ రెండు విషయాల్లో భారత్‌ను అడ్డుకుంటాం

Posted by Kishore on 00:08 with No comments
జైషే మహ్మాద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించేందుకు సహకరించాలని కోరుతున్న భారత్ విజ్ఞప్తిని చైనా మరోసారి తోసిపుచ్చింది. అణ్వాయుధాల సరఫరాల గ్రూపులో భారత్ చేరడంపై తమ వైఖరి మారబోదని పునరుద్ఘాటించింది.
రేపటి నుంచి రెండు రోజులపాటు గోవాలో బ్రిక్స్ సదస్సు జరుగనున్న నేపథ్యంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి జెంగ్ శువాంగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
ఐక్యరాజ్య సమితి చార్టర్ సంప్రదింపులు, ఏకాభిప్రాయం ప్రకారమే భారత్ అణ్వాయుధాల సరఫరాల గ్రూప్‌లో చేర్చుకోవాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.

మరోవైపు మసూద్ అజార్ ను తీవ్రవాదిగా ప్రకటించాలని భారత్ కోరుతుండటంపై ఆయన స్పందించారు. ‘ఈ అంశం సభ్య దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే మేం అతనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు’ అని జెంగ్ వివరించారు.

ఇండియా అణ్వాయుధాల సరఫరా గ్రూపులో సభ్యదేశం కావాలంటే 48దేశాలు అంగీకరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
చైనా భారత్ సభ్యత్వాన్ని తిరస్కరించడంతో ఈయేడాది జూన్ లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు కూడా భారత్ దరఖాస్తును పక్కనబెట్టాయి.

అయితే ఈ అంశాలు భారత్-చైనాల మధ్య దౌత్యసంబంధాలకు ఏమాత్రం ఆటకం కాదని జెంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.