పాక్‌ పని పట్టాల్సిందే!

Posted by Kishore on 04:22 with No comments

రీ ఘటనకు ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైనిక దళాలు జరిపిన మెరుపు దాడులు ఇస్లామాబాద్‌ వెన్నులో వణుకు పుట్టించాయి. పీఓకేలోకి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వరకు చొచ్చుకెళ్లి భారత సైన్యం చేపట్టిన చర్య, అసాధారణమైనది. ఆ దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, వారికి అండగా నిలిచిన కొందరు పాక్‌ సైనికులూ నేలకూలారు. ఉపఖండం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టే దిశలో ఇదో పెద్ద ముందడుగు. వెయ్యి గాట్లు చేసి భారత్‌ నెత్తురు కళ్లజూసేందుకు పాక్‌ మూడు దశాబ్దాల క్రితం పూనుకొన్నప్పుడే ఇలాంటి గట్టి చర్యల విషయంలో మన సైన్యానికి పూర్తి అధికారాలు కల్పించి ఉండాల్సింది. ఇంతకాలంపాటు ఇండియాను వేధించే అవకాశం పాక్‌కు లభించేదే కాదు. అణ్వస్త్రాలు కలిగి ఉన్న రెండు దేశాలూ సమస్యకు ఏదో ఒక పరిష్కారమైనా సాధించి ఉండేవి. అప్పుడప్పుడు దౌత్యపరమైన చర్చలు, ఉగ్రవాద దాడుల కారణంగా వాటిలో సుదీర్ఘ ప్రతిష్టంభన... ఇలా ఒక లక్ష్యం లేకుండా భారత్‌ సాగిపోయింది. పరిస్థితిలో ఇప్పటికైనా మార్పు రావడం శుభసూచకం.
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ఇదివరకటి నాయకులకన్నా ఎంత దృఢంగా వ్యవహరిస్తున్నారో పాకిస్థాన్‌కు ఇప్పుడు తెలిసివచ్చింది. ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా రూపొందుతున్న భారత దేశం, పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఇంకెంత మాత్రం సహించే పరిస్థితిలో లేదని ఇప్పటికే తేటతెల్లమైంది. అలాగని పాకిస్థాన్‌ బుద్ధిగా వ్యవహరించే సూచనలూ లేవు. పాక్‌ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ కీలుబొమ్మ మాత్రమే. సైన్యాధిపతి రహీల్‌ షరీఫ్‌దే అసలు సిసలు అధికారమంతా. నవాజ్‌ మాటను రహీల్‌ వినే అవకాశమే లేదు. పాక్‌లో పౌర ప్రభుత్వం ఎప్పుడూ నామమాత్రమైనదే. సైన్యమే సర్వ శక్తిమంతమైనది. అలాంటి సైన్యం దూకుడుగా వ్యవహరిస్తుందనడంలో సందేహం లేదు. వచ్చే నెలలో పదవీ విరమణ పొందాల్సి ఉన్న రహీల్‌ షరీఫ్‌, భారత్‌పై మరిన్ని దాడులు జరిపించి, ఉద్రిక్తతల్ని మరింతగా రెచ్చగొట్టడం ద్వారా పదవీకాలం పొడిగించుకోవాలనుకొంటున్నారు. 2014 డిసెంబరులో పెషావర్‌లో బడిపిల్లల్ని ఉగ్రవాదులు పాశవికంగా వూచకోత కోసినప్పుడు రహీల్‌ షరీఫ్‌ గట్టిగా వ్యవహరించారు. ‘చెడ్డ’ ఉగ్రవాదుల్ని ఏరివేయడం ద్వారా పాకిస్థానీ జనసామాన్యంలో మంచి పేరు సంపాదించుకొన్నారు కానీ, తాజాగా భారత్‌ మెరుపు దాడుల దరిమిలా ఆయన ప్రతిష్ఠ అడుగంటింది. అందుకే ఏదో ఒక దుస్సాహసానికి ఒడిగట్టడం ద్వారా పట్టు నిలబెట్టుకోవాలనుకొంటున్నారు.
కశ్మీర్‌లోని కొన్ని శక్తులు మరీ అరాచకంగా వ్యవహరిస్తున్నాయి. భారత్‌ మెరుపుదాడుల్లో పాకిస్తానీ సైనికుల మరణం పట్ల అవి సంతాపం ప్రకటించాయి. పాకిస్థాన్‌ విషయంలో గట్టిగా వ్యవహరిస్తున్న భారత్‌, ఈ చర్య ద్వారా ఆ శక్తులకు తగు సందేశం ఇచ్చినట్లయింది. హురియత్‌ నాయకత్వంలో రాళ్ల దాడులకు పాల్పడుతున్న మూక ఇక తోక ముడవాల్సిందే. ఈ హెచ్చరికను పెడచెవిన పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అవి తెలుసుకోవాలి. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులు బాగా లేనప్పుడు, కశ్మీర్‌లోనూ మామూలు స్థితిగతులు కొనసాగే అవకాశం లేదు. రావల్పిండిలోని సైనిక జనరళ్లే కాదు, కశ్మీరు లోయలోని గిలానీలు, మలిక్‌లూ ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించాల్సిందే. శాంతి, సామరస్యాల కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు బలగాల్ని రంగంలోకి దింపాల్సిందే. నిరుడు మియన్మార్‌లో తీవ్రవాదుల ఏరివేతకు మన దళాలు సైనిక చర్య చేపట్టినప్పుడు కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ అనుభవం నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకొంది. ఇప్పుడు సైనిక, దౌత్య, రాజకీయ, మీడియా పరంగా అన్ని విధాలా సమన్వయ సహకారాలతో సర్కారు ముందుకెళ్లింది. జాతి యావత్తూ ఏకతాటి మీదకు వచ్చినప్పటికీ, వేర్పాటువాదులతో చర్చించాల్సిందేనని ఇప్పటికీ వాదిస్తున్న కొందరు ఉలిపికట్టెల గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఇన్నాళ్లూ పాటించిన వ్యూహాత్మక సహనం ఇక పనిచేయని అస్త్రమే. పాక్‌ జరిపే ప్రతీ దాడిని ఎప్పటికప్పుడు గట్టిగా తిప్పి కొట్టాల్సిందే. శాంతియుత పరిస్థితులు ఉంటేనే ఆర్థిక వృద్ధి సాధించగలమన్న మాట నిజమే. కానీ, పాకిస్థాన్‌ ఆగడాలను సహించే పరిస్థితి ఇంకెంత మాత్రం లేదు. భారత్‌ పట్ల ద్వేషమే శ్వాసగా బతుకుతున్న దేశమది. చిరశాంతి కోసం ఆ దేశంతో యుద్ధం చేయడానికైనా సిద్ధపడాల్సిందే. పాక్‌ ఆటలు మాత్రం ఇకపై కొనసాగడానికి వీల్లేదు!