ప్రధాని పిలుపుతో మార్పు...చైనా వస్తువులపై వ్యతిరేకత

Posted by Kishore on 23:57 with No comments
ఒకప్పుడు చైనా వస్తువులకు ఆ బజార్ అడ్డా. దేశ రాజధానిలో ఉన్నా ఎక్కువగా చైనా ప్రాడెక్టులే లభించేవి. కానీ ఇప్పుడు అక్కడ ఒక్క చైనా వస్తువు కూడా కనిపించదు. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కానీ చైనా వస్తువులను స్వచంధంగా నిషేధించారు.
 
ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఆట వస్తువుల వరకు, పూలు ప్రమిదల నుంచి అలంకరణ సామాగ్రి వరకు, ఆభరణాలు మొదలు టపాసుల వరకు ఏదీ కావాలన్నా కేరాఫ్ అడ్రస్ ఢిల్లీ సదర్ బజార్. ఇక్కడ దొరకని వస్తువంటూ ఏదీ లేదు. మన దేశంలో తయారయ్యే వస్తువులతో పాటు విదేశీ వస్తువులు కూడా ఇక్కడ విక్రయిస్తారు. అది కూడా తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయిక్కడ. నిన్నమొన్నటి వరకు ఇక్కడ చైనా వస్తువులదే హవా. కానీ ప్రధాని మోదీ చేసిన ఒక్క విజ్ఞప్తితో ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు చైనా వత్తాసు పలుకుతోంది. అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది.
 
అక్కడి వస్తువులను మనదేశంలోకి చొప్పించి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని భావిస్తోంది. అందుకే చైనాకు దిమ్మ తిరిగేలా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. చైనా వస్తువులను బహిష్కరించాలని కోరారు. మోదీ విజ్ఞప్తితో ఢిల్లీ సదర్ బజార్‌లో చైనా వస్తువులను బహిష్కరించారు. చైనా వస్తువులను సదర్ బజార్ వ్యాపారస్తులు పూర్తిగా నిషేధించారు. మేక్ ఇన్ ఇండియా ప్రాడక్ట్స్‌ను మాత్రమే విక్రయిస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారు.
 
నష్టాలు వస్తున్నప్పటికీ మన సంపద మనకే ఉండాలి అనే నినాదంతో చైనా బ్రాండ్స్‌ను అమ్మడం లేదని అంటున్నారు. ప్రధాని విజ్ఞప్తితో ప్రజల్లో కూడా మార్పు కనిపిస్తోంది. స్వదేశీ వస్తువులనే కొంటున్నారు. గతేడాదితో పోల్చితే ఈ సారి లాభాలు కాస్త తగ్గినా స్వదేశీ వస్తువులు అమ్మడం ఆనందంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. చైనా బ్రాండ్స్‌ను పూర్తిగా నిషేధిస్తే దేశీయంగా తయారు చేసిన వస్తువులకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.