కృత్రిమ దీవిని తలపిస్తున్న చైనా 'యుద్ధనౌక

Posted by Kishore on 02:20 with No comments

చైనా తొలిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న అత్యాధునిక విమాన వాహక నౌక శరవేగంగా పూర్తవుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటోలు ఈ విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. టైప్ 001-ఏ పేరుతో ఒక 'కృత్రిమ దీవి' తరహాలో అత్యాధునికమైన సాంకేతిక హంగులతో ఈ యుద్ధనౌకను చైనా తయారుచేస్తోంది. ఇందులో యుద్ధనౌక వంతెనలు, యుద్ధ విమానాయాన సౌకర్యాలు, యుద్ధ నియంత్రణ సాంకేతికత, రేడార్లు, స్పెన్సర్లు వంటి ఆధునిక హంగులు ఉంటాయి. తూర్పు బీజింగ్‌కు సమీపంలోని పోర్డ్ సిటీ డాలియన్‌లోని డ్రై డాక్‌ వద్ద 'టైప్‌ 001-ఏ' యుద్ధ వాహకనౌక నిర్మాణం జరుగుతోంది. దీని బరువు 60వేల టన్నుల వరకు ఉంటుంది. ఇందులో 36 జె-15 ఫైటర్లతో సహా 50 యుద్ధ విమానాలు తరలించవచ్చు. రష్యా ఎస్‌యూ-27కు ప్రతిరూపంగా చైనా ఈ యుద్ధవిమానాన్ని రూపొందిస్తోంది. త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి సముద్ర ట్రయల్స్‌ నిర్వహిస్తారని, 2020 కల్లా పూర్తిస్థాయిలో చైనా నేవీకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నౌకను రష్యా రూపొందించిన 'లియానింగ్‌' నౌక ఆధారంగా రూపొందిస్తున్నట్టు సమాచారం. చైనా యుద్ధనౌకతో పాటు కొత్త జే-15 ఫైటర్‌ విమానాల ఫొటోలు తాజాగా చైనా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చైనా వైమానిక యుద్ధనౌకలు, ఫైటర్‌ విమానాల సామర్థ్యాన్ని చాటే విధంగా ఉన్నాయి. చైనా తాజా యుద్ధనౌక రక్షణపరంగా భారత నావికాదళానికి ఆందోళన కలిగించే అంశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌ దేశీయంగా రూపొందించిన విక్రాంత్‌ విమాన వాహక యుద్ధ నౌకను మూడేళ్ల క్రితం కోచి తీరంలో ప్రవేశపెట్టింది.