అణు యుద్ధానికి సన్నద్ధమౌతున్న పుతిన్

Posted by Kishore on 03:57 with No comments

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడో ప్రపంచ యుద్ధానికి సన్నద్ధమౌతున్నారా? తాజా పరిణామాల్ని బట్టి చూస్తే అవుననే అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. విదేశాల్లో ఉన్న రష్యన్ అధికారులు కుటుంబాలతో సహా స్వదేశానికి తిరిగి రావాలని పుతిన్ ఆదేశించారు. పుతిన్ నుంచి హై లెవెల్ వార్నింగ్ అందిందని అధికారులు ధృవీకరిస్తున్నారు. విదేశాల్లో చదువుకుంటోన్న తమ చిన్నారులను కూడా అధికారులు స్వదేశానికి తీసుకురావాలని పుతిన్ ఆదేశాల్లో స్పష్టంగా ఉంది. వివిధ దేశాల్లో ఉన్న రష్యన్ అధికారులు, ఉద్యోగులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అన్ని స్థాయిల కార్మికులకు, ప్రజలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఆదేశాలు పాటించని వారు భవిష్యత్ పరిణామాలకు వారే బాధ్యులవుతారని కూడా పుతిన్ హెచ్చరించారు.
 
మూడో ప్రపంచ యుద్ధానికి సన్నద్ధమౌతూనే పుతిన్ ఈ ఆదేశాలు జారీ చేశారని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా న్యూక్లియార్ వార్‌ దిశగా రష్యా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. రష్యా ఇటీవలే పెద్ద ఎత్తున రక్షణ విన్యాసాలు నిర్వహించింది. ఇందులో 40 మిలియన్ల మంది ప్రజలకు అణు యుద్ధంపై కూడా అవగాహన కల్పించారు. అదే సమయంలో కనీసం 14 మిలియన్ల ప్రజలకు రక్షణ కల్పించేందుకు బంకర్లను నిర్మించాలని కూడా పుతిన్ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు.
 
వాస్తవానికి పుతిన్ ఫ్రాన్స్‌లో పర్యటించాల్సి ఉండగా అకస్మాత్తుగా ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. సిరియాలో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సువా హొలాందే ఆరోపించడంతో పుతిన్ తమ పారిస్ పర్యటనను సడన్‌గా రద్దు చేసుకున్నారు. అమెరికా ఆరోపణలను యూరోపియన్ యూనియన్ బలపరుస్తూ రష్యాను విలన్‌గా చూపించే యత్నాలను పుతిన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. అమెరికా, ఈయూ బాగా అతి చేస్తున్నాయని కూడా పుతిన్ భావిస్తున్నారు. తగిన సందర్భం చూసి అమెరికా, ఈయూతో సహా రష్యా వ్యతిరేకులకు తగిన గుణపాఠం నేర్పాలని పుతిన్ తలపోస్తున్నారు.
 
ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత రష్యా-అమెరికా సంబంధాలు ఇటీవల అత్యంత హీనస్థాయికి పడిపోయాయి. సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక దళాలపై రష్యా విరుచుకుపడుతుండటం అమెరికాకు నచ్చడం లేదు. సిరియా అధ్యక్షుడు అసద్‌ను లొంగతీసుకోవాలన్న అమెరికా ప్లాన్‌కు పుతిన్ అడ్డంకిగా మారారు. అంతటితో ఆగక తమ సైనిక చర్యలకు అడ్డుపడితే అమెరికా యుద్ధవిమానాలను కూడా కూల్చడానికి వెనుకాడబోమని పుతిన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి పెరిగాయి. అటు పుతిన్ అడుగులను అమెరికా జాగ్రత్తగా గమనిస్తోంది. అమెరికా మిలిటరీ అధికారులు వాషింగ్టన్‌లో ఇటీవలే ప్యూచర్ ఆఫ్ ద ఆర్మీ పేరుతో సమావేశాలు కూడా నిర్వహించారు. మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి రష్యా సన్నాహాలను లోతుగా అధ్యయనం చేశారు. ప్రపంచంలోని అతి పెద్ద, శక్తిమంతమైన సైనిక బలగాల్లో ఒకటైన రష్యా అణ్వస్త్ర యుద్ధానికే సై అంటోందని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు.