రూ.35,000 కోట్లు ముంచిన నోట్‌7

Posted by Kishore on 00:12 with No comments
గెలాక్సీ నోట్‌ 7 స్మార్ట్‌ఫోన్లను వెనక్కి రప్పించడం, విక్రయాల నిలిపివేత వల్ల శామ్‌సంగ్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుత త్రైమాసికంలో మొబైల్‌ వ్యాపారం ద్వారా వచ్చే లాభమంతా కోల్పోయే అవకాశం ఉంది. నోట్‌ 7 విక్రయాల నిలిపివేత ప్రభావంతో ప్రస్తుత, రాబోయే త్రైమాసికాల్లో 300 కోట్ల డాలర్ల (సుమారు రూ.20000 కోట్లు) భారం పడనుందని శామ్‌సంగ్‌ వెల్లడించింది. దీంతో ఈ ఫోన్లను వెనక్కి రప్పించడం వల్ల మొత్తంగా పడే భారం 530 కోట్ల డాలర్లని (రూ.35000 కోట్లు) తెలిపింది. బ్యాటరీ వేడెక్కడం, పేలిపోవడం లాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో గెలాక్సీ నోట్‌ 7 విక్రయాలను శామ్‌సంగ్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం దృష్ట్యా ఇప్పటికే అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి లాభం అంచనాలను 260 కోట్ల డాలర్ల (రూ.17000 కోట్లు) వరకు తగ్గించింది. అంటే మొబైల్‌ వ్యాపారం ద్వారా వచ్చే లాభాన్ని పూర్తిగా శామ్‌సంగ్‌ కోల్పోనుందన్నమాట. అయితే పై మొత్తంలో మొదటి సారి రీకాల్‌ వ్యయ భారాన్ని కంపెనీ కలపలేదు. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ భారం 88 కోట్ల డాలర్ల (1 ట్రిలియన్‌ వాన్‌) నుంచి 166 కోట్ల డాలర్ల (2 ట్రిలియన్‌ వాన్‌) వరకు ఉండే అవకాశం ఉంది. రీకాల్‌ వల్ల పడే భారాన్ని ఇతర వ్యాపారాల ద్వారా శామ్‌సంగ్‌ తగ్గించుకునే అవకాశం కనిపిస్తంది. రీకాల్‌ వ్యయ భారం పోను మూడో త్రైమాసికంలో 460 కోట్ల డాలర్ల (దాదాపు రూ.30,000 కోట్లు) ఆదాయాన్ని ఆర్జిస్తామని కంపెనీ ఆశాభావంతో ఉంది. అయితే ఇందులో చాలా భాగం అడ్వాన్స్‌డ్‌ డిస్‌ప్లేలు, సెమీ కండక్లర్ల విక్రయాల ద్వారా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే నాణ్యత ప్రమాణాల ప్రక్రియను మెరుగుపర్చుకునేందుకు గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టుబోతున్నట్లు శామ్‌సంగ్‌ తెలిపింది. అయితే పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
భారత్‌లో రూ.6,457 కోట్లు..
గెలాక్సీ నోట్‌ 7 రీకాల్‌ ప్రభావంతో శామ్‌సంగ్‌ ఇండియా రూ.6,457 కోట్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని పరిశోధన సంస్థ సీఎంఆర్‌ వెల్లడించింది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో శామ్‌సంగ్‌ ఇండియా ఆదాయం 46 శాతం వృద్ధితో రూ.45,446 కోట్లు నమోదుకావొచ్చని ఇంతకుమునుపు అంచనా వేశాం. అయితే నోట్‌ 7 పరిణామం నేపథ్యంలో ఆదాయం 25 శాతం మాత్రమే పెరిగి రూ.39,989 కోట్లుగా ఉండొచ్చని అనుకుంటున్నామ’ని తెలిపింది. అయితే కంపెనీ ఆర్థిక గణాంకాలపై ఆయా పరిశోధన సంస్థలు వెల్లడిస్తున్న అంచనాలు తప్పులని శామ్‌సంగ్‌ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. ‘గెలాక్సీ నోట్‌ 7ను ఇప్పటివరకు భారత్‌లో విక్రయించలేదు. వస్తోన్న నివేదికలకు భిన్నంగా ఈ ఏడాది రికార్డు విక్రయాలను సాధిస్తామ’ని తెలిపారు.