అధ్యక్ష పీఠం ఎవరెక్కినా.. భారత్‌తో సంబంధాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పాలి

Posted by Kishore on 23:58 with No comments
భారత్‌తో సంబంధాలకు పెద్దపీట వేయాల్సిందిగా అమెరికాకు ఆ దేశ అత్యున్నత మేధావి వర్గం సిఫార్సు చేసింది. రానున్న ఎన్నికల్లో గెలిచి దేశాధ్యక్ష పదవిని ఎవరు చేపట్టినా సరే తమ పదవీకాలంలోని తొలి వంద రోజుల్లోపే భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవ్వాలని సూచించింది. తద్వారా ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు ఇస్తున్న ప్రాధాన్యతను బలంగా చాటిచెప్పినట్లవుతుందని పేర్కొంది. భారత్‌-అమెరికా భద్రత సహకారంపై అమెరికాకు చెందిన ‘వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయనాల కేంద్రం(సీఎస్‌ఐఎస్‌)’ తాజాగా కీలక నివేదిక సమర్పించింది. భారత్‌తో రక్షణ సంబంధాలు బలోపేతమవ్వాలంటే.. వ్యవస్థాపక ఒప్పందాలపై ఆ దేశం సంతకాలు చేసేలా చూడటం ముఖ్యమని సీఎస్‌ఐఎస్‌ సూచించింది. లేనిపక్షంలో కొన్ని కీలక పరిజ్ఞానాలను భారత్‌కు అందజేయడం దాదాపు అసాధ్యమని వెల్లడించింది. పసిఫిక్‌, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో భద్రతా వ్యవహారాలకు సంబంధించి భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌లతో సంయుక్త చర్చలు జరిపేలా నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. తాలిబన్లతో చర్చల్లో పాల్గొనాల్సిందిగా భారత్‌కు ఆహ్వానం అందించాలని సిఫార్సు చేసింది. బలమైన నేతగా ఎదిగిన మోదీతో ప్రస్తుత దేశాధ్యక్షుడు బరాక్‌ ఒబామా అత్యున్నత స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని గుర్తుచేసింది.
వాతావరణ మార్పులు, సముద్ర భద్రత వంటి అంతర్జాతీయ సమస్యలపై పోరులో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుండటాన్ని స్వాగతిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రత మండలి(ఎన్‌ఎస్‌సీ)లో దక్షిణాసియా విభాగపు సీనియర్‌ సంచాలకుడు పీటర్‌ లవోయ్‌ వెల్లడించారు. సీఎస్‌ఐఎస్‌లో ఆయన మాట్లాడారు. గత ఎనిమిదేళ్లలో భారత్‌తో రక్షణ సంబంధాల్లో అపూర్వ ప్రగతి చోటుచేసుకుందన్నారు. మరోవైపు, భారత్‌తో ఒప్పంద కూటమి ఏర్పాటుచేసే అవకాశాలను లవోయ్‌ కొట్టిపారేశారు. 21వ శతాబ్దం ఒప్పంద కూటముల యుగం కాదని.. పరస్పర ప్రయోజనాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లో ఈ ఏడాది జరగాల్సిన సార్క్‌(దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం) సదస్సు వాయిదా పడటంపై విచారం లవోయ్‌ వ్యక్తంచేశారు. ఆసియాన్‌ వంటి కూటముల స్థాయిలో సామర్థ్యం మేరకు సార్క్‌ పనిచేయలేకపోయిందని వ్యాఖ్యానించారు.