మాటలు చెప్పదు.. చేతలే! - భారత సైన్యానికి మోదీ ప్రశంస

Posted by Kishore on 00:18 with No comments
సర్జికల్‌ దాడులకు ఆధారాలు చూపాలన్న ప్రతిపక్ష నేతలపై ప్రధాని మోదీ పరోక్షంగా విరుచుకుపడ్డారు. భారత సైన్యం వాక్‌శూరత్వం చూపదని, తన వీరత్వాన్ని ప్రదర్శిస్తుందని స్పష్టంచేశారు. శుక్రవారం భోపాల్లో ‘శౌర్య స్మారక్‌’ను ఆవిష్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాజీ సైనిక సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. సరిహద్దులు, దేశాలకు అతీతంగా మానవ జాతిని భారత సైన్యం రక్షిస్తోందని కితాబిచ్చారు. ‘మన జవాన్ల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వారి యూనిఫారం, వారి ధైర్యసాహసాల గురించే ప్రస్తావిస్తుంటాం. కానీ అంతకుమించిన మూర్తీభవించిన మానవత్వం వారిలో ఉంది. వారు మాటలు చెప్పరు.. వీరత్వాన్ని చూపుతారు. మన రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌ కూడా అంతే’ అని హర్షధ్వానాల నడుమ చెప్పారు. సభికులు దేశభక్తి నినాదాలు చేశారు. ఇంతకుముందు తానీ వ్యాఖ్యలు చేసి ఉంటే విమర్శకులు తనపై దాడిచేసేవారని, మోదీ నిద్రపోతున్నారని, ఏమీ చేయడం లేదని అనేవారని తెలిపారు. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భారత ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు. ‘యెమెన్‌ యుద్ధంలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడంలో భారత సైనికులు కీలక పాత్ర పోషించారు. 5వేల మంది భారతీయులను, పాకిస్తానీలతో పాటు ఇతర దేశాలవారినీ కాపాడారు. సరిహద్దులను రక్షిస్తూ.. మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు’ అని కొనియాడారు. మేల్కొని ఉండాల్సిన సమయంలో నిద్రపోతే సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సైన్యం మనల్ని క్షమించదని స్పష్టం చేశారు. శివాజీ, మహారాణా ప్రతాప్‌ వంటివారు మన వీరత్వానికి ప్రతీకలని పరీకర్‌ పేర్కొన్నారు. ‘మనం ఎవరినీ ఇబ్బందిపెట్టం. ఎవరైనా మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తే వదిలిపెట్టం అనేది ఆయన విధానం’ అని చెప్పారు.