అధ్యక్షులు ఎవరైనా మోదీని కలవాల్సిందే!

Posted by Kishore on 04:25 with No comments

అమెరికా అధ్యక్ష స్థానానికి కొత్తగా ఎవరు ఎన్నికైనా కూడా తొలి వంద రోజుల్లోనే భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవాల్సిందేనని అమెరికాకు చెందిన ఓ సర్వే సంస్థ స్పష్టంచేసింది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తామని బలమైన సంకేతాలు ఇవ్వాలని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పదవీకాలం త్వరలో ముగుస్తోంది. నవంబరు 8న దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ తరఫున హిల్లరీ క్లింటన్‌ పోటీ చేస్తున్నారు.
అయితే కొత్తగా ఎన్నికై శ్వేతసౌధంలోకి వెళ్లేదెవరైనా భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుందని సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ అనే సంస్థ ‘ఇండో-అమెరికాలు భద్రతపై పరస్పర సహకారం’ అంశంపై ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. కొత్తగా ఎన్నికయ్యే వారు భారత్‌-అమెరికాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని పేర్కొంది. కీలక ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. కొత్త ప్రభుత్వం ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌లతో కలిసి పనిచేయాలని, పసిఫిక్‌, హిందూ మహాసముద్ర ప్రాంతంలో అందరికీ ఆసక్తికర అంశాలపై దృష్టి పెట్టాలని వెల్లడించింది.
భారత్‌తో చక్కని ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించాలని తెలిపింది. ఉగ్రవాద నిర్మూలన కోసం తాలిబన్లతో జరిపే చర్చలకు అమెరికా కొత్త ప్రెసిడెంట్‌ భారత్‌ను ఆహ్వానించాలని సర్వే సంస్థ పేర్కొంది. మధ్యప్రాచ్య దేశాల అంశంపైనా అమెరికా-భారత్‌ల విదేశాంగ శాఖ మంత్రులు చర్చలు జరపాలని తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రధాని నరేంద్ర మోదీతో సత్సంబంధాలు నెలకొల్పిన సంగతి తెలిసిందే.