పాక్‌ మరింత ఏకాకి!

Posted by Kishore on 00:09 with No comments
ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా మరింత ఏకాకిని చేసే దిశగా భారత తన దౌత్యపోరును మరింత తీవ్రతరం చేసింది. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి సమావేశాలు శనివారం నుంచి గోవాలో జరుగనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పెంగ్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా ప్రభుత్వాధినేతలు తరలివస్తున్నారు. బ్రిక్స్‌ భేటీకి ముందు పుతిన్‌, జిన్‌పెంగ్‌లతో ప్రధాని మోదీ విడివిడిగా ముఖాముఖి ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించాలని, తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై చర్యలు తీసుకోవాలని ఆయన గట్టిగా కోరనున్నారు. ముఖ్యంగా జైషే మహ్మద్‌ నేత మసూద్‌ అజర్‌పై ఐక్యరాజ్యసమితి ఉగ్రవాది ముద్ర వేయకుండా అడ్డుకుంటున్న చైనా వైఖరిపై జిన్‌పెంగ్‌తో ఆయన చర్చిస్తారు. ఉరీలో భారత సైనిక స్థావరంపై పాక్‌ ప్రేరిత ఉగ్రవాదుల దాడి దరిమిలా భారతలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యం ఏ ర్పడింది. పాక్‌కు గట్టి మద్దతిస్తున్న చైనా.. భారత యత్నాలను అడ్డుకునే అవకాశముంది. అయితే మౌలికంగా అన్ని రకాల ఉగ్రవాదాన్ని జిన్‌పెంగ్‌ ఖండించే అవకాశముంది. కాగా.. బ్రిక్స్‌ సమావేశానికి ముందు బంగాళాఖాత బహుముఖ సాంకేతిక ఆర్థిక సహకార కూటమి(బిమ్స్‌టెక్‌) భేటీ జరుగుతుంది. అనంతరం ఆదివారం బ్రిక్స్‌-బిమ్స్‌టెక్‌ సం యుక్త సమావేశం ఉంటుంది. ఇందులో పాల్గొనేందుకు భూటాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, థా య్‌లాండ్‌ ప్రధానులు, మియన్మార్‌ స్టేట్‌ కౌన్సిలర్‌ కూడా వస్తున్నారు. అఫ్గానిస్థాన్‌, మాల్దీవులను ప్ర త్యేక అతిథులుగా ఆహ్వానించారు. ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలను ఏర్పాటుచేసి వారికి ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశాలపై చర్యలు తీసుకోవాలని మోదీ ఈ సందర్భంగా కోరతారు. ఇప్పటికే పాక్‌ సీమాంతర ఉగ్రవాద చర్యలను భారత ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో, జి-20 భేటీలో ఎండగట్టింది. కశ్మీరును అంతర్జాతీయ సమస్యగా చిత్రించేందుకు పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఆయన దౌత్యవేత్తలు చేసిన ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. కాగా.. భారత జాతీయ భద్రత సలహాదారు అజిత ధోవల్‌ బ్రిక్స్‌ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొన్నారు.
 
ఉగ్రవాదం అణచివేతలో పరస్పర సహకారంపై చర్చించారు. ఆ సహకారానికి చట్టబద్ధత కల్పించాలని ప్రతిపాదించారు. ఆయన వాదనతో ఆయా దేశాల అగ్రనేతలు, దౌత్యవేత్తలు ఏకీభవించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసేవారిపైనే గాక.. వారికి ఆయుధాలు, మందుగుండు అందజేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని ధోవల్‌ గట్టిగా అభ్యర్థించారు. సైబర్‌ భద్రత, ఉగ్రవాదం అణచివేత, ఇంధన భద్రతపై వర్కింగ్‌ గ్రూపుల ఏర్పాటుకు బ్రిక్స్‌ దేశాలు సమ్మతించాయి. కాగా, బ్రిక్స్‌, బిమ్స్‌టెక్‌ భేటీల నేపథ్యంలో.. కొత్త భాగస్వామ్యాలకు బాటలు వేయడం, ఆసియా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుక్కునేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. మరోవైపు, వివాదాస్పద అంశాలను భారత, పాక్‌ శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అమెరికా సూచించింది.