సినిమా వెనక సినిమా.. పవర్ స్టార్

Posted by Kishore on 02:22 with No comments

పవన్ ఈ మధ్య సినిమాల జోరు పెంచాడు. ఇటీవల తన జనసేన పార్టీ తరఫున రెండు బహిరంగ సభలు నిర్వహించిన తర్వాత ఓ సినిమా చేస్తుండగానే మరో సినిమాను ఒప్పేసుకుంటున్నాడు. ప్రస్తుతం కాటమరాయుడు సినిమాను చేస్తున్నాడు. సినిమాను లేటుగానే సెట్స్ మీదకు తీసుకెళ్లినా.. షూటింగ్‌ను మాత్రం శరవేగంగా పూర్తిచేస్తున్నాడు. తాజాగా ఏఎం రత్నం డైరెక్షన్‌లో సినిమా చేసేందుకూ సిద్ధమైపోయాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. మంగళవారం దసరా పర్వదినాన ఆ కార్యక్రమాలను నిర్వహించారు. తమిళంలో అజిత్ హీరోగా రూపొందిన ‘వేదాళం’ను రీమేక్ చేస్తున్నారు. వచ్చే ఏడాదే ఆ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి. వేదాళంలో అజిత్ టాక్సీ డ్రైవర్‌గా కనిపించాడు. ప్రతీకార నేపథ్యంలో సాగే సినిమా అది. ఇక, త్రివిక్రమ్ కాంబినేషన్‌లోనూ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాపై ఎలాంటి ప్రకటనా లేనప్పటికీ సినిమా మాత్రం పక్కా అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏడాదికి ఒక్క సినిమానే విడుదల చేసే పవర్ స్టార్.. ఇప్పుడు మూడు నుంచి నాలుగు సినిమాలు చేసేందుకు డిసైడయ్యాడట. మరి సినిమాలు బంద్ చేసి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెడతానన్న పవన్.. సినిమా వెనక సినిమా తీయడానికి కారణాలేంటి? ఇటీవల ప్రత్యేక హోదా కోసం ప్రత్యక్ష పోరు సలుపుతానని పవన్ ప్రకటించాడు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో జనసేన బరిలో ఉంటుందని చెప్పకనే చెప్పాడు. మరి ఎన్నికల బరిలో నిలవాలంటే ఖర్చు భారీగానే ఉంటుంది కదా. ఆ ఖర్చు కోసమే పవన్ వీలైనన్ని ఎక్కువ సినిమాలు ఒప్పేసుకుంటున్నాడని ఓ టాక్. తద్వారా తన రెవెన్యూను పెంచుకోవాలని భావిస్తున్నాడట. ఆ సినిమాల ద్వారా సంపాదించే డబ్బును తన పార్టీ కార్యాచరణకు ఉపయోగిస్తాడట. కారణాలు ఏమైనప్పటికీ.. పవన్ వెనువెంటనే సినిమాలను ఒప్పేసుకోవడం అతడి అభిమానులకైతే పండగే మరి!