పగిలిన మనసుల మ్యూజియం
Posted by Kishore on 07:33 with No comments
పురాతన వస్తువులు, అద్భుతమైన కళాఖండాలు భద్రపరచేది మ్యూజియం అని అందరికీ తెలుసు. క్రొయేషియాలోని జగ్రెబ్‌లోనూ ఓ మ్యూజియం ఉంది. దీని కథే వేరు. ఇందులో ఉండే వస్తువులన్నీ ప్రేమికుల ప్రేమకు గుర్తుగా ఇచ్చిపుచ్చుకున్న నజరానాలు. కాకపోతే వారి బంధం బెడిసికొట్టాకే ఇక్కడకు చేరతాయి.
సూటిగా విషయానికొస్తే.. ఒలింకా విస్టికా, డ్రేజెన్ గ్రుబ్సిక్ ప్రేమికులు. నాలుగేళ్లు గాఢంగా ప్రేమించుకున్నాక ఏవో తేడాలొచ్చి విడిపోయారు. మరి ఇన్నాళ్లుగా ఇచ్చిపుచ్చుకున్న బహుమతుల సంగతేంటి అనుకుంటుంటే ‘ఓ మ్యూజియం పెట్టేస్తో పోలా?’ అంది ఒలింకా. డ్రేజెన్ సీరియస్‌గా తీసుకున్నాడు. ప్రేమ కానుకలన్నీ ఒక్కచోటికి తెచ్చాడు. తమలా బ్రేకప్ చెప్పుకున్న స్నేహితుల నుంచి కూడా ఆ ఇద్దరూ ప్రేమకానుకలు సేకరించారు.
వాటన్నింటితో కలిపి 2006లో తొలిసారి ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మేం కలిసి ఉన్నపుడు మా ప్రేమకు గుర్తులివిగో అని చాటింపు వేస్తే ఎవరికైనా ఆసక్తే కదా! జనం విరగబడి చూశారు. ఇదేదో బాగుందనుకొని ఆ వస్తువులతో అర్జెంటీనా, బోస్నియా అండ్ హెర్జెగొవినా, జర్మనీ, మాసిడోనియా, ఫిలిప్పీన్స్, సెర్బియా, సింగపూర్, స్లొవేనియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాలు చుట్టొచ్చారు. ఈ అపురూప కానుకల్ని లక్షలమంది వీక్షించారు. వేలి ఉంగరాల నుంచి కాలికి వేసుకునే చెప్పుల దాకా.. అన్నీ ఈ విచిత్ర మ్యూజియమ్‌లో ఉన్నాయ్. దుస్తులు, ఉత్తరాలు, సెల్‌ఫోన్లు, ఫొటోఫ్రేమ్‌లు, బొమ్మలు, దుస్తులు, మేగజైన్లు, నగ్న చిత్రాలు, బొకేలు, ఆఖరికి లోదుస్తులు సైతం ప్రదర్శనకు పెట్టారు. ఓ సుందరి అయితే బ్రేకప్ తర్వాత తన ప్రేమికుడు ఇచ్చిన బహుమానాలన్నీ బద్ధలు కొట్టేసి ఆ గొడ్డలిని ఈ మ్యూజియానికి ఇచ్చేసింది. ఇలాంటి అరుదైనవి మూడువందలపైనే ఉన్నాయి. ప్రేమలో ఉన్నపుడు కలిగే భావోద్వేగాలు, అనుబంధాలు, మధుర జ్ఞాపకాల్ని మరోసారి గుర్తు చేసుకోవడానికే మా ఈ ప్రయత్నం అంటున్నారు ఆ మాజీ ప్రేమికులు. అన్నట్టు ఇది ఐరోపాలోనే అత్యంత వినూత్నమైన మ్యూజియంగా కెన్నెత్ హడ్సన్ అవార్డు గెల్చుకుంది.
0 comments:
Post a Comment
Thank you for Contacting us.
We reply you shortly...!