హిందువులపై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

Posted by Kishore on 23:50 with No comments
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రవాస భారతీయులతో భేటీ కాబోతున్నారు. రిపబ్లికన్ హిందూ కొయలిషన్ (ఆర్‌హెచ్‌సీ) న్యూజెర్సీలో ఆదివారం నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఉగ్రవాదం వల్ల బాధితులైన హిందువులనుద్దేశించి ఆయన మాట్లాడతారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల కార్యక్రమానికి అధ్యక్ష అభ్యర్థి హాజరవడం ఇదే మొదటిసారని ఆర్‌హెచ్‌సీ వ్యవస్థాపక చైర్మన్ శలభ్ ‘షల్లి’ కుమార్ చెప్పారు. ఈ సమావేశం వల్ల కశ్మీరీ, హిందూ శరణార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. హిందువులు, భారతీయులతో స్నేహం కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
 
గత నెలలో విడుదల చేసిన వీడియోలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తాను ఆర్‌హెచ్‌సీ సమావేశానికి హాజరవుతానని పేర్కొన్నారు. హిందూ సమాజం ప్రపంచ నాగరికతకు, అమెరికా సంస్కృతికి విశేష సేవలందించిందన్నారు. కుటుంబ విలువలు, కఠోర శ్రమ, బలమైన అమెరికన్ విదేశాంగ విధానం సంబంధిత పరస్పర విలువలను ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అత్యంత అద్భుతమైనదని తెలిపారు.