మరో సంచలనానికి సిద్దమైన గూగుల్, ఫేస్‌బుక్

Posted by Kishore on 00:35 with No comments
యావత్ ప్రపంచాన్ని ఇంటర్నెట్టుతో అనుసంధానించే కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్ దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలు మరో బృహత్తరకార్యానికి సన్నాహాలు చేస్తున్నాయి. సెకనుకు 15వేల జీబీల సమాచారాన్ని బదిలీ చేయగల అత్యంత శక్తిమంతమైన కేబుల్ తో ఆసియాను, అమెరికాలను సముద్ర అంతర్భాగం ద్వారా అనుసంధానించనున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజిలస్ నగరం నుండి ప్రారంభమయ్యే ఈ కేబుల్ హాంకాంగ్ ను అనుసంధానిస్తుంది. సాంకేతిక భాషలో చెప్పాలంటే 120 టెరాబైట్స్ పర్ సెకండ్ వేగంతో ఈ కేబుల్ డేటాను బదిలీ చేస్తుంది. రెండు ఖండాలకు అటో దిక్కున ఇటో దిక్కున గల హాంకాంగుకు, లాస్ ఏంజిలస్ నగరాలకు మధ్య దూరం అక్షరాల 12800 కిలోమీటర్లు. ఇంటర్నెట్ చరిత్రలో ఈ ప్రాజెక్ట్ అతిపెద్ద విప్లవంగా చెప్పవచ్చు. పసిఫిక్ మహాసముద్రం అంతర్భాగం నుండి వేయనున్న ఈ ఇంటర్నెట్ కేబుల్ ప్రాజెక్టులో గూగుల్, ఫేస్ బుక్ తో పాటు పసిఫిక్ డేటా కమ్యూనికేషన్, టీఈ సబ్ కామ్ తదితర నాలుగు సంస్థలు పాలుపంచుకోనున్నాయి. వచ్చే రెండేళ్లలోగా ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయాలని ఈ సంస్థలు కంకణం కట్టుకున్నాయి.